
తిరుమల శ్రీవారి ఆలయంలో ఇవాళ సాలకట్ల ఆణివార ఆస్థానం పర్వదినం ఘనంగా జరుగుతోంది. ప్రతి ఏటా ఈ కార్యక్రమం జరుగుతూనే ఉంటుంది. సౌరమానం ప్రకారం దక్షిణాయన పుణ్యకాలంలో కర్కాటక సంక్రాంతినాడు ఈ ఉత్సవాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహిస్తుంది. అయితే తమిళులు ఈ సౌరమానాన్ని అనుసరిస్తారు. ఆ ప్రకారం.. ఆణిమాసం చివరి రోజున నిర్వహించే కొలువు కావడంతో ఆణివార ఆస్థానమని పేరు. ఈ ఉత్సవ నేపథ్యంలో ఇవాళ ఉదయం 7 గంటలకు ఉభయదేవేరులతో కూడిన శ్రీ మలయప్పస్వామివారు బంగారువాకిలి ముందు గల ఘంటా మండపంలో సర్వభూపాల వాహనంలో గరుత్మంతునికి అభిముఖంగా కొలువుకు వేంచేపు చేశారు.
స్వామివారి సర్వసైన్యాధ్యక్షుడైన శ్రీవిష్వక్సేనులవారు మరో పీఠంపై దక్షిణాభిముఖంగా వేంచేపు చేశారు. ఈ ఉత్సవమూర్తులతో పాటు ఆనందనిలయంలోని మూలవిరాట్టుకు వేదపండితులు ప్రత్యేకపూజలు నిర్వహిస్తారు. అనంతరం ప్రసాదాలు నివేదిస్తారు. ఆణివార ఆస్థానం కారణంగా ఇవాళ అష్టదళ పాదపద్మారాధన, కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది. ఈ ఉత్సవం సందర్భంగా మూడు రోజుల పాటు జరగనుంది. ఇవాళ కవచాధివాసం జరగనుంది.
