
జీవితంలో ఒక్కసారి అయినా అమర్ నాథ్ యాత్రకు వెళ్లాలనుకునే ఎక్కువ మంది కోరుకుంటారు. అక్కడ కొలువై ఉన్న శివుడిని చూసి దర్శించాలని పరితపిస్తారు. ఆ ప్రయాణం ఎంత కష్టమైనదైనా ఆనందంగానే ప్రయాణాన్ని కొనసాగిస్తారు. అలా ఏటా అమర్నాథ్ యాత్రకు వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతూనే ఉంటోంది. ఇప్పటికే రిజిస్ట్రేషన్ ప్రకియ ప్రారంభమైంది. శ్రీ అమర్ నాథ్ పుణ్యక్షేత్ర బోర్డు (SASB) వెబ్సైట్ లేదా దేశంలోని 540కిపైగా బ్యాంకుల్లో ఆఫ్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.
అమర్ నాథ్ యాత్ర కాశ్మీర్ లోని లిడర్ లోయలో ప్రారంభమవుతుంది. శివుడు ఉండే అమర్ నాథ్ గుహకు రెండు దారులు ఉన్నాయి. ఒకటి అనంత్ నాగ్ లోని నున్వన్-పహల్గామ్ మార్గం అయితే, రెండోది గందెర్బల్ లో ఉండే ఎత్తయిన బల్తల్ నుంచి వెళ్లే మార్గం. ఈ బల్తల్ నుంచి వెళ్లే మార్గం దగ్గరిదారి అయినప్పటికీ చాలా ఎత్తుగా ఉంటుంది.
ఈ ఏడాది అమర్ నాథ్ యాత్ర (Amarnath Yatra) జులై 3న మొదలై ఆగస్టు 9న ముగుస్తుంది. మొత్తం 38 రోజుల పాటు యాత్ర కొనసాగనుంది. అమర్ నాథ్ వెళ్లడానికి అనంత్నాగ్ జిల్లాలోని పహల్గామ్, గాందర్బల్ జిల్లాలోని బాల్తాల్ మీదుగా రెండు మార్గాలున్నాయి. ఏప్రిల్ 22న పహల్గాంలో పర్యటకులపై ఉగ్ర దాడి జరిగిన నేపథ్యంలో అమర్నాథ్ యాత్ర కోసం కేంద్రం కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టింది. యాత్రకు ముందు ఉగ్రదాడి జరిగే అవకాశముందనే ఉద్దేశ్యంతో అమర్నాథ్ యాత్రికుల భద్రత కోసం ‘ఆపరేషన్ శివ’ను ఈ కేంద్రం చేపట్టనుంది. ఈ ఆపరేషన్లో భాగంగా అమరనాథ్ యాత్ర ప్రారంభం నుంచి ముగింపు వరకు యాత్రికులకు పటిష్టమైన భద్రత కల్పించనున్నారు.
అమర్నాథ్ యాత్ర (Amarnath Yatra) సమయంలో ఆ మార్గంలో హై అలర్ట్ కొనసాగించాలని కేంద్ర హోం శాఖ ఇప్పటికే ఉన్నతాధికారులను స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఉన్నతాధికారులు, పోలీస్, పారా మిలటరీ ఉన్నతాధికారులు అమర్ నాథ్ యాత్రా మార్గంలో భద్రత చర్యలను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. జూలై 3న మొదటి బ్యాచ్ యాత్రికులతో కూడిన బస్సులు శ్రీనగర్ నుంచి బయలుదేరుతాయి. 50వేలకు పైగా సైనికులను యాత్ర మార్గాలు, బేస్ క్యాంపులు, సున్నిత ప్రదేశాల్లో మోహరిస్తున్నారు. బాడీ స్కానర్లు, సీసీటీ వీ కెమెరాలు, 24/7 నిఘాతో కూడిన మూడంచెల భద్రతా వ్యవస్థను అమలు చేయనున్నారు.
యాత్రికులకు సూచనలు
🚩 యాత్రికులు పైకి ఎక్కుతున్నప్పుడు మెల్లగా ఎక్కాలి. మధ్యమధ్యలో విశ్రమించాలి.
🚩 శరీరంలో తేమ పాళ్లు (హైడ్రేటెడ్) ఉండేందుకు తగినంత నీరు త్రాగాలి.
🚩 ఊపిరి సరిగా ఆడకపోయినా, అసౌకర్యంగా అనిపించినా దగ్గరిలోని వైద్య బృందాలను సంప్రదించాలి.
🚩 RFID (Radio Frequen- cy Identification – యాత్రికుల ట్రాకింగ్, భద్రతా ప్రయోజనాల కోసం ఉపయోగిస్తారు) అనే ఐడెంటిటీ కార్డు లేకుండా ఎవరికీ యాత్రకు అనుమతి లేదు.
🚩 మద్యం తీసుకోకూడదు.
🚩 ప్రమాద హెచ్చరికలు పెట్టిన చోట ఎట్టిపరిస్థితుల్లో ఆగకూడదు.
🚩 చెప్పులు ధరించకూడదు. వీటి వల్ల కిందపడిపోయే అవకాశం ఉన్నందున ట్రెక్కింగ్ షూలు మాత్రమే ధరించాలి.
🚩 యాత్ర సమయంలో షార్ట్ కట్ రూట్లలో వెళ్లకూడదు.
🚩 యాత్రలో పర్యావరణానికి హాని చేయకూడదు. ప్లాస్టిక్ వాడకం పూర్తిగా నిషేధం.
