శ్రావణ మాసం నేటి నుంచి ప్రారంభమైంది. మూఢాల కారణంగా మూడు నెలలుగా శుభ కార్యాలనేవే లేవు. శుక్ర మౌఢ్యం, ఆషాడం, గురు మౌఢ్యం కారణంగా మూడు నెలల పాటు శుభకార్యాలు లేకుండా పోయాయి. నేటి నుంచి శుభకార్యాలన్నీ తిరిగి ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలోనే నేటి నుంచి పెళ్లిళ్లు, గృహప్రవేశాలు వంటి శుభకార్యాలన్నీ జరగనున్నాయి. ఇక శ్రావణ మాసంలో ఏమేం పండుగలు రానున్నాయో ముందుగానే తెలుసుకున్నాం. 8వ తేదీన నాగుల చవితి, 9న నాగులపంచమి, 16న వరలక్ష్మీ వ్రతం, 19న రాఖీ పౌర్ణమి, 27న కృష్ణాష్టమి ఉన్నాయి.
ఇక శ్రావణ మాసం సెప్టెంబర్ 3న ముగియనుంది. కాబట్టి ఈ నెల 31 లోగా శుభకార్యాలన్నింటినీ ముగించేసుకోవాలని పండితులు చెబుతున్నారు. ముఖ్యంగా వివాహాల వంటి శుభకార్యాలకు ఈ నెల 7, 8, 9, 10, 11, 15, 16, 17, 18, 21, 22, 23, 24, 28 తేదీలు అత్యంత శుభప్రదమైనవని తెలియజేస్తున్నారు. జాతకాలను బట్టి ఈ తేదీల్లో దేనినో ఒకదానిని నిర్ధారించుకోవాలని సూచిస్తున్నారు. ఈ సంవత్సరం ఏప్రిల్ 27వ తేదీ శుక్ర మౌఢ్యం.. మే 5 నుంచి గురు మౌడ్యం.. ఇక జూలై 6వ తేదీ ఆషాఢ శుద్ధ పాడ్యమి వంటి మూఢాల కారణంగా శుభకార్యాలన్నీ నిలిచిపోయాయి. ఇక శుభకార్యాలు ప్రారంభం కావడంతో మండపాల నుంచి పూజారుల వరకూ అంతా బిజీ అయిపోయారు.