బీహార్‌లోని కైమూర్ జిల్లాలో పన్వర కొండపై ఉన్న ముండేశ్వరి భవాని ఆలయం గురించి మనం ఇప్పటికే తెలుసుకున్నాం. ఇక్కడి అమ్మవారికి బలి ఇచ్చిన మేక తిరిగి బతుకుతుందని తెలుసుకున్నాం. మార్కండేయ పురాణం ప్రకారం అప్పట్లో చందా, ముండా అనే ఇద్దరు రాక్షసులు.. శుంభ, నిశుంభ అనే రాక్షసుల రాజులకు సేవ చూస్తూ ఉండేవారు. రాజు అండ చూసుకుని చందా, ముండల ఆగడాలు మరింత పెరిగాయి. జనాలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారట. అప్పుడు దుర్గాదేవి.. భవానీ దేవిగా అవతరించిందట.
భవాని దేవి మహిషునిపై స్వారీ చేసి తొలుత చందాని సంహరించిందట. దీంతో భయపడిపోయిన ముండా పన్వర కొండపై దాక్కున్నాడు. అప్పుడు ముండాని కొండపై భవానీ మాత సంహరించింది. అనంతరం అక్కడే ముండేశ్వరీ మాతగా కొలువు దీరి పూజలందుకుంటోంది. ఇక్కడ ఉన్న ముండేశ్వరి విగ్రహం ప్రకాశవంతమైనది కావడంతో అమ్మవారిని ఎక్కువ సేపు దృష్టి నిలపలేరట. ఇక్కడ అమ్మవారిని దర్శించుకుంటే ఆశీస్సులు లభిస్తాయట. కోరికలు తీరిన అనంతరం భవానీ దేవికి తమ కృతజ్ఞతలు తెలియజేయడానికి, అమ్మవారికి బలులు సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. అయితే ఇక్కడ ఎప్పుడూ రక్తపాతానికి తావుండదు.