
తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఇటీవలి కాలంలో భక్తుల విషయంలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు నిర్వహిస్తున్నారు. ఎప్పటికప్పుడు అన్ని విషయాల్లోనూ చాలా జాగ్రత్త తీసుకుంటున్నారు. భక్తుల దర్శనంతో పాటు అన్నప్రసాదం, ట్రాఫిక్ నియంత్రణ విషయంలో అన్ని విధాలుగా భక్తులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా టీటీడీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆకస్మిక తనిఖీలు నిర్వహించి మరీ భక్తులకు సరిగా సౌకర్యాలు అందుతున్నాయా? లేదా? అనే విషయాలను పరిశీలిస్తున్నారు.
తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రంలో టీటీడీ అడిషనల్ ఈఓ శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి మంగళవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా భోజనం రుచి, నాణ్యత గురించి భక్తుల అభిప్రాయాలు తెలుసుకున్నారు. అనంతరం భక్తులతో కలిసి ఆయన సహపంక్తి భోజనం చేశారు. భోజనం రుచి, నాణ్యత చాలా బాగుందని భక్తులు అడిషనల్ ఈఓ వద్ద ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈఓ శ్రీ రాజేంద్ర, స్పెషల్ క్యాటరింగ్ అధికారి శ్రీ శాస్త్రి పాల్గొన్నారు.
