తిరుమలలోని పలు క్యూ లైన్లను, నారాయణగిరి షెడ్స్, వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్ట్మెంట్లను శనివారం సాయంత్రం ఆదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన నారాయణగిరి ఉద్యానవనాల్లోని భక్తులు వేచి ఉండే షెడ్లు, క్యూలైన్లు, లగేజీ, మొబైల్ డిపాజిట్ కౌంటర్లు, ప్రధమ చికిత్స కేంద్రాలను తనిఖీ చేశారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని స్కానింగ్ సెంటర్, భక్తులకు అందుతున్న అన్నప్రసాదాలు, తాగునీరు, పాలు, పారిశుద్ధ్యం, తదితర సౌకర్యాలను పరిశీలించారు. కంపార్ట్మెంటులో పారిశుద్ధ్యం మరింత మెరుగ్గా ఉండాలని సూచించారు.
అనంతరం కంపార్ట్మెంట్ లలో శ్రీవారి సేవకులు భక్తులకు అందిస్తున్న పాలను పరిశీలించారు. వివిధ ప్రాంతాల నుండి విచ్చేసి భక్తులకు వారందిస్తున్న సేవలను ఆయన ప్రశంసించారు. అనంతరం వైకుంఠం క్యూ కాంప్లెక్స్- 1, తిరుమల నంబి ఆలయం, ఆలయ పరిసరాలను పరిశీలించి దర్శనం క్యూ లైన్లను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. అదనపు ఈవో వెంట ఎస్ ఈ- 2 శ్రీ జగదీశ్వర్ రెడ్డి, శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ లోకనాథం, విజిఓ శ్రీ నందకిషోర్, ఇతర అధికారులు ఉన్నారు.