తిరుమలలోని శ్రీవారి ఆలయ నాలుగు మాడ వీధుల్లోని గ్యాలరీలను ఆదివారం సంబంధిత అధికారులతో కలిసి తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి పరిశీలించారు. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 4 నుంచి జరగనున్న విషయం తెలిసిందే. ఈ బ్రహ్మోత్సవాలకు ఇప్పటి నుంచే ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే శ్రీవారి పుష్కరిణిని నెల రోజుల పాటు మూసివేసి మరమ్మతు పనులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే భక్తుల స్నానాల కోసం ప్రత్యేకంగా ట్యాప్‌లు ఏర్పాటు చేశారు. ఈ బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 12 వరకూ జరగనున్నాయి.
ఈ నేపథ్యంలో, నాలుగు మాడ వీధుల్లో ఉన్న వివిధ ప్రవేశ, నిష్క్రమణ, హారతి పాయింట్ల గురించి తెలుసుకోవడానికి అన్ని గ్యాలరీలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. వాహన మండపం నుంచి ప్రారంభమై నాలుగు మాడ వీధుల్లోని గ్యాలరీలు, తిరుమల నంబి ఆలయం వద్ద కదిలే వంతెన, గ్యాలరీల వద్ద ప్రవేశ నిష్క్రమణ పాయింట్లు, ఇతర సంబంధిత సమాచారాన్ని అధికారులు అదనపు ఈవోకు వివరించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఈవోతో పాటు ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ లోకనాథం, విజివో శ్రీ నంద కిషోర్, ఇతర అధికారులు పాల్గొన్నారు.