ఈ ఆలయంలో స్వామివారి వేలాయుధానికి అభిషేకం..

తమిళనాడులోని మధురై అమ్మవారి క్షేత్రానికి 9 కి.మీ దూరంలో తిరుప్పరంకుండ్రంలోని సుబ్రహ్మణ్య స్వామి ఆలయం గురించి తెలుసుకున్నాం కదా. సాధారణంగా ఏ ఆలయంలోనైనా గర్భగుడిలోని మూలవిరాట్టుకు అభిషేకం చేయడం ఆనవాయితీ. కానీ ఈ ఆలయంలో మాత్రం ఆసక్తికరంగా స్వామివారి మూలవిరాట్టుకు కాకుండా స్వామి ఆయుధమైన వేలాయుధానికి అభిషేకం నిర్వహించడం ఆనవాయితీ. దీనికి కూడా ఒక కారణం ఉంది. అదేంటంటే.. సూరపద్ముడనే రాక్షసుని సంహరించిన తరువాత సుబ్రహ్మణ్యుడు తన వేలాయుధంతో ఈ క్షేత్రానికి వచ్చినట్లు స్కంద పురాణం ద్వారా తెలుస్తోంది.

తమిళులు పెరటాశి మాసాన్ని అత్యంత పవిత్రమైన మాసంగా భావిస్తారు. ఈ సమయంలో స్వామివారి వేలాయుధాన్ని పక్కనే కొండపై ఉన్న కాశీవిశ్వనాథుని ఆలయానికి తీసుకెళ్లి ప్రత్యేక పూజలు జరిపిస్తారు. ఇక ఈ ఆలయంలో శివపార్వతుల మందిరం, కర్పగ వినాయక మందిరం, విష్ణుమూర్తి ఆలయాలు ఉపాలయాలుగా ఉన్నాయి. కంబతడి మండపం, అర్థ మండపం, మహా పండపాలను దర్శించుకోవచ్చు. ఇక్కడి శిల్పకళా నైపుణ్యం చూపు తిప్పుకోనివ్వదు. ఈ క్షేత్రంలో సుబ్రహ్మణ్యస్వామి తన వేలాయుధంతో రాతిపై కొట్టాడట. దాని నుంచి గంగాజలం ఉబికి వచ్చి పాపనాశిని తీర్థంగా మారిపోయిందట. ఈ తీర్థంలో స్నానమాచరిస్తే జన్మాంతర పాపాలు సైతం తొలగిపోతాయని నమ్మకం. ఈ తీర్థం ఏసమయంలోనైనా నీటితో కళకళలాడుతూనే ఉంటుంది.

Share this post with your friends