తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి ఆలయంలో సెప్టెంబరు 16 నుంచి పవిత్రోేత్సవాలు జరుగుతున్న విషయం తెలిసిందే. అవి నేటితో ముగియనున్నాయి. ఇక పవిత్రోత్సవాల్లో భాగంగా రెండో రోజు మంగళవారం శాస్త్రోక్తంగా పవిత్ర సమర్పణ జరిగింది. ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి సహస్రనామార్చన, నిత్యార్చన చేపట్టారు. ఆ తరువాత ఉదయం 11.30 గంటల నుండి పవిత్ర సమర్పణ నిర్వహించారు. ఇందులో అమ్మవారి మూలమూర్తికి, ఉత్సవర్లకు, ఉప ఆలయాలకు, పరివార దేవతలకు, విమానప్రాకారానికి, ధ్వజస్తంభానికి పవిత్రాలు సమర్పించారు.
కాగా, సాయంత్రం 6 నుంmr రాత్రి 8 గంటల వరకు యాగశాలలో వైదిక కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయంలో యాత్రికుల వల్లగానీ, సిబ్బంది వల్ల గానీ తెలియక దోషాలు జరుగుతుంటాయి. ఇలాంటి వాటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా నివారించేందుకు ప్రతి ఏడాదీ మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. ఈ కార్యక్రమంలో చంద్రగిరి ఎంఎల్ఏ శ్రీ పులివర్తి నాని దంపతులు, టీటీడీ జేఈవో శ్రీ వీరబ్రహ్మం దంపతులు, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ గోవింద రాజన్, ఏఈవో శ్రీ రమేష్, అర్చకులు శ్రీ బాబుస్వామి, సూపరింటెండెంట్ శ్రీ శేషగిరి, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ సుభాష్, శ్రీ గణేష్ తదితరులు పాల్గొన్నారు.