తిరుమలలో వైభవంగా ప్రణయ కలహోత్సవం

తిరుమల శ్రీవారి ఆలయంలో బుధవారం సాయంత్రం ప్రణయ కలహోత్సవం వేడుకగా జరిగింది. ప్రతి సంవత్సరం వైకుంఠ ఏకాదశికి సరిగ్గా ఆరో రోజు, అధ్యయనోత్సవంలో 17వ రోజు తిరుమలలో ప్రణయ కలహోత్సవం నిర్వహించడం ఆనవాయితీ. ఇందులో భాగంగా సాయంత్రం 4 గంటలకు శ్రీ మలయప్పస్వామివారు పల్లకి ఎక్కి మహాప్రదక్షిణ మార్గంలో స్వామి పుష్కరిణి వద్దకు వచ్చారు. ఇంతలో అమ్మవార్లు చెరొక పల్లకిపై అప్రదక్షిణంగా స్వామివారికి ఎదురుగా వచ్చి నిలుచున్నారు. పురాణ పఠనం జరుగుతుండగా అమ్మవార్ల తరఫున జియ్యంగార్లు పూలచెండ్లను స్వామివారిపై మూడుసార్లు విసిరి వేసారు.

స్వామివారు బెదిరినట్లుగా నటించి తానేమి తప్పు చేయలేదని అమ్మవార్లను ప్రాధేయపడతారు. అనంతరం అమ్మవార్లు శాంతించి స్వామివారికి ఇరువైపులా చేరి కర్పూరహారతులు అందుకుని ఆలయానికి చేరుకున్నారు. ఆ తరువాత ఆస్థానం నిర్వహించారు. ఈ ఉత్సవంలో శ్రీ నమ్మాళ్వార్‌ రచించిన ఆళ్వార్‌ దివ్య ప్రబంధంలోని పాసురాలను నిందాస్తుతి శైలిలో అర్చకులు పారాయణం చేయడం ప్రత్యేకత. ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి, తిరుమల శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌ స్వామి, టీటీడీ అదనపు ఈవో శ్రీ వెంకయ్య చౌదరి, ఇతర అధికారులు, భక్తులు పాల్గొన్నారు.

Share this post with your friends