శ్రీ వేంకటేశ్వర గో సంరక్షణశాలలో వైభవంగా గోపూజ మహోత్సవం

వేదాలు, పురాణాల్లో పేర్కొన్న విధంగా సకల దేవతాస్వరూపాలైన గోవులను రక్షించుకుని, సనాతన హైందవ ధర్మాన్ని కాపాడుకోవాలని తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో శ్రీ జె. శ్యామలరావు పిలుపునిచ్చారు. తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర గోసంరక్షణశాలలో మంగళవారం గోకులాష్టమి గోపూజ మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా టిటిడి ఈవో మాట్లాడుతూ, భారతీయ సంస్కృతిలో గోవుకు ప్రముఖ స్థానం ఉందన్నారు. గోవును హిందువులు గోమాతగా పూజిస్తారని, తద్వారా పాడిపంటలు వృద్ధి చెంది దేశం సస్యశ్యామలం అవుతుందన్నారు. గో శాలలో పశువుల షెడ్ల వద్ద ఉంచిన బెల్లం, బియ్యం, పశుగ్రాసాన్ని భక్తులు స్వయంగా పశువులకు తినిపించే అవకాశాన్ని టీటీడీ కల్పించిందని వివరించారు.

అనంతరం తిరుపతి ఎమ్మెల్యే శ్రీ శ్రీనివాసులు మాట్లాడుతూ.. గోవు గొప్పతనాన్ని భావితరాలకు అందించేందుకు టీటీడీ గోపూజ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టాల‌న్నారు. గోశాల‌లో గోకులాష్టమి గోపూజకు చాల ప్రాధాన్యత ఉందన్నారు. గోవును పూజించడం వలన పాడిపంటలు పుష్కలంగా పండి లోకం సుభిక్షంగా వుంటుందని తెలిపారు.అంతకుముందు ఈవో దంపతులు గో పూజ నిర్వహించారు. అనంత‌రం శ్రీ వేణుగోపాల స్వామివారికి ప్రత్యేక పూజ‌లు నిర్వహించారు. అంత‌కుముందు శ్రీ వేణుగోపాలస్వామివారికి అభిషేకం, వేణుగానం, ఎస్వీ వేదపాఠశాల విద్యార్థులతో వేదపఠనం, భజనలు, కోలాటం, అన్నమాచార్య సంకీర్తనాలాపన నిర్వహించారు. తరువాత ఎస్‌పిడ‌బ్ల్యు విద్యార్థినులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. సాయంత్రం హిందూ ధర్మప్రచార పరిషత్‌ కళాకారులతో హరికథ వినిపిస్తారు.

Share this post with your friends