లోక కళ్యాణార్థం తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో యజుర్వేద పారాయణం జరుగుతోంది. చతుర్వేద పారాయణంలో భాగంగా నేటి (సెప్టెంబరు 1) నుంచి తిరుమల శ్రీవారి ఆలయంలో 4వ విడత శుక్ల యజుర్వేద పారాయణం ప్రారంభం కానుంది. చతుర్వేద పారాయణంలో భాగంగా జూలై 1న ప్రారంభమైన సామవేద పారాయణం ఆగస్టు 31న ముగిసింది. శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో ప్రతిరోజు ఉదయం 9 నుంచి 10 గంటల మధ్య వేద పండితులు శుక్ల యజుర్వేదం పారాయణం చేయనున్నారు.
యజుర్వేదం అంటే యాగాలు ఎలాచేయాలో చెప్పేది. యాగము, బలి, దానము మొదలైనవాటిని ఆచరించేటపుడు ఋత్విక్కులు (పురోహితులు) చెప్పే మంత్రాలు (పద్యాలు) యజుర్వేదంలో ఉన్నాయి. యజ్ఞాలలో యజుర్వేదాన్ని అనిష్ఠించేవారికి “అధ్వర్యులు” అని పేరు. కృష్ణ యజుర్వేదం లో తైత్తరీయ సంహితయందలి 7 అష్టకాలలో (కాండాలు) 44పన్నాలు (అధ్యాయాలు) ఉన్నాయి. 651 అనువాకములు, 2198 పనసలు (ప్రకరణములు) ఉన్నాయి. తైత్తరీయ బ్రాహ్మణం (పరాయితం) 3 అష్టకాలలో [కాండాలు] 38 పన్నాలు [అధ్యాయాలు]ఉన్నాయి. 378 అనువాకములు, 1841 పనసలు (ప్రకరణములు) ఉన్నాయి.