ఏడాదిలో దీపావళి సందర్భంగా మాత్రమే తెరుచుకునే కర్ణాటకలోని హసనాంబ ఆలయం గురించి మనం ఇంతకు ముందే తెలుసుకున్నాం. హసన్‌లో ఉన్న ఈ ఆలయాన్ని దర్శించుకునేందుకు లక్షల మంది భక్తులు తరలివచ్చారు. దీపావళి సమయంలో ఈ హసనాంబ అమ్మవారి ఆలయాన్ని తెరిచి 11 రోజుల పాటు ఉత్సవాలు నిర్వహిస్తారు. రేపు మధ్యాహ్నం 12 గంటలకు అమ్మవారి ఆలయాన్ని మూసివేయనున్నారు. కాగా.. నిన్నటి వరకూ 16 లక్షల మంది వరకూ హసనాంబ ఆలయాన్ని దర్శించుకున్నారు. అంటే రోజుకు 2 లక్షల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుంటున్నారు. అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
అమ్మవారి ఆలయానికి టిక్కెట్లు, ప్రసాదాల విక్రయం ద్వారా రూ.8 కోట్ల ఆదాయం సమకూరినట్టు ఆలయ అధికారులు వెల్లడించారు. ఈ ఏడాది దేశం నలుమూలల నుంచి భక్తులు తరలి వచ్చారు. భక్తుల తాకిడి మరింత ఎక్కువవడంతో ఆలయ అధికారులు పాస్‌లు రద్దు చేశారు. అయినా కూడా భక్తుల తాకిడి తగ్గలేదు. ఇవాళ సాయంత్రం 5 గంటల వరకూ మాత్రమే హసనాంబ దర్శనానికి అవకాశం ఉంటుంది. ఆ తరువాత శ్రీ సిద్దేశ్వర స్వామి రథోత్సవం ప్రారంభమవుతుంది. తిరిగి రాత్రి 11 గంటల నుంచి దర్శనాలు ప్రారంభమవుతాయి. సోమవారం ఉదయం 6 గంటల వరకూ దర్శనానికి భక్తులను అనుమతిస్తారు. అనంతరం పూజలు నిర్వహించి ఆలయ గర్భగుడిని మూసివేయనున్నారు.