శ్రీ వేంకటేశ్వరస్వామికి అపర భక్తురాలైన భక్త కవయిత్రి మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ 207వ వర్ధంతి ఉత్సవాలు ఆగస్టు 13వ తేదీ తిరుమల, తిరుపతి, తరిగొండలో ఘనంగా జరుగనున్నాయి. వెంగమాంబ జన్మస్థలమైన తరిగొండలో కొలువైన శ్రీ లక్ష్మీనృసింహస్వామివారి ఆలయంలో ఆగస్టు 13వ తేదీ సాయంత్రం 5 నుంచి రాత్రి 7 గంటల వరకు శ్రీలక్ష్మీ నృసింహస్వామివారికి కల్యాణోత్సవం, తరువాత అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులతో హరికథ కార్యక్రమాలు నిర్వహిస్తారు.
తిరుపతిలో…
తిరుపతి ఎం.ఆర్.పల్లి సర్కిల్ వద్ద ఉన్న తరిగొండ వెంగమాంబ విగ్రహానికి ఆగస్టు 13వ తేదీన ఉదయం 9 గంటలకు టీటీడీ అధికారులు పుష్పాంజలి ఘటిస్తారు. అనంతరం శ్వేత భవనంలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ హాల్ లో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు సాహితి సదస్సు నిర్వహించనున్నారు. తరువాత అన్నమాచార్య కళామందిరంలో సాయంత్రం 5.30 నుంచి రాత్రి 8.30 గంటల వరకు అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులతో భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహిస్తారు.
తిరుమలలో…
ఆగస్టు 13వ తేదీ ఉదయం 9 గంటలకు తిరుమలలోని తరిగొండ వెంగమాంబ బృందావనంలో టీటీడీ ఉన్నతాధికారులు పుష్పాంజలి సమర్పించనున్నారు.