శ్రీరామ నవమి వేడుకలకు అయోధ్య రామమందిరం సిద్ధమవుతోంది. దీని కోసం ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లనూ సిద్ధం చేశారు. అయితే శ్రీరామనవమి కోసం లక్ష కిలోల పైనే లడ్డూని ప్రసాదం కోసం తయారు చేస్తున్నారు. ఇంతకీ తయారు చేస్తున్నది ఎవరో తెలుసా? దేవరహ హన్స్ బాబా ట్రస్ట్. ఈ ట్రస్ట్ సభ్యులు బాల రామయ్య కోసం 1,11,111 కిలోల లడ్డూ ప్రసాదాన్ని తయారు చేసి ఆలయానికి పంపించనుంది. ఈ విషయాన్ని ట్రస్ట్ సభ్యులు అతుల్ కుమార్ సక్సేనా వివరించారు. ఈ ట్రస్ట్ సభ్యులు ప్రతి వారం లడ్డూ ప్రసాదాలను కాశీ విశ్వనాథ ఆలయంతో పాటు తిరుమల వేంకటేశ్వరస్వామి వారి ఆలయాలకు పంపిస్తుంటారు.
〈శ్రీరామనవమి రోజు అయోధ్యలో అపూర్వఘట్టం..〉
ఈ ఏడాది జనవరి 22న అయోధ్యలో బాల రామయ్య ప్రాణ ప్రతిష్ట రోజున కూడా దేవరహ హన్స్ బాబా ఆశ్రమం నుంచి 40 వేల కిలోల లడ్డూను పంపించారు. ఇక శ్రీరామనవమి నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అయోధ్యలో భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. అయోధ్యలో ఎక్కడికక్కడ సీసీ కెమెరాలను అధికారులు ఏర్పాటు చేశారు. స్వామివారి విగ్రహాన్ని ప్రత్యేకంగా ఆ రోజు అలంకరించనున్నారు. దీని కోసం ప్రత్యేకంగా వస్త్రాలను సిద్ధం చేశారు. అలాగే వేల క్వింటాళ్ల పూలతో ఆలయాన్ని అలంకరించనున్నారు. ఇప్పటికే చాలా మంది భక్తులు అయోధ్యకు చేరుకోగా.. శ్రీరామనవమి నాటికి లక్షలాది మంది భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు.