వైకుంఠ ద్వార ద‌ర్శ‌నానికి 1.20 లక్షల ఎస్ఎస్‌డీ టోకెన్లు: టీటీడీ ఈవో

సామాన్య భ‌క్తుల సౌక‌ర్యార్థం వైకుఠ ఏకాద‌శికి తిరుప‌తి, తిరుమ‌లలోని 91 కౌంటర్ల ద్వారా టోకెన్లు జారీ చేస్తామ‌ని, టోకెన్లు క‌లిగిన భ‌క్తులకు మాత్ర‌మే శ్రీ‌వారి ద‌ర్శ‌నం క‌ల్పించ‌నున్న‌ట్లు టీటీడీ ఈవో శ్రీ జె.శ్యామ‌ల‌రావు చెప్పారు. భ‌క్తుల ర‌ద్ధీ నేప‌థ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానానికి స‌హాక‌రించాల‌ని ఆయ‌న‌ విజ్ఞ‌ప్తి చేశారు. శ్రీ‌వారి భ‌క్తుల‌కు టీటీడీ అందిస్తున్న సౌక‌ర్యాలు, చేప‌ట్టిన సంస్క‌ర‌ణ‌ల‌ను ప‌లువురు భ‌క్తులు అభినందించారు. తిరుమల అన్నమయ్య భవనంలో శ‌నివారం డయల్‌ యువర్‌ ఈవో కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా టీటీడీ ఈవో భక్తులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు.

వైకుంఠ ద్వార దర్శనానికి విచ్చేసే భక్తులకు 10 రోజుల పాటు వసతి పొందేందుకు ప్రత్యేకంగా కౌంటర్లు ఏర్పాటు చేయాలని ఓ భక్తురాలు కోరారు. అలాగే శ్రీవారి మెట్టు నడక మార్గంలో దర్శనం టోకెన్లు ఇవ్వాలని, రైల్వే రిజర్వేషన్‌ను సైతం 90 రోజుల నుంచి 60 రోజులకు తగ్గించినందున ఆన్‌లైన్‌లో ఆర్జిత సేవలు బుకింగ్‌ను మూడు నెలల నుంచి రెండు నెలలకు తగ్గించాలని కోరారు. దీనికి ఈవో సమాధానమిస్తూ.. తిరుమ‌ల‌లో వసతికి కౌంటర్లు ఏర్పాటు చేసేందుకు, ఆన్‌లైన్‌లో ఆర్జిత సేవల బుకింగ్ కాల వ్యవధి మూడు నెలల నుంచి రెండు నెలలకు తగ్గించే విషయం పరిశీలిస్తామన్నారు. వైకుంఠ ద్వార ద‌ర్శ‌నానికి తిరుపతిలో 1.20 లక్షల ఎస్ఎస్‌డి టోకెన్లు జారీ చేస్తామని ఈవో తెలిపారు.

Share this post with your friends