శ్రీ గోవిందరాజ స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు సింహ వాహనంపై స్వామివారు ఊరేగారు. సింహవాహనంపై స్వామివారి వైభవం చూసి తీరాల్సిందే. ఇక నేటి రాత్రికి ముత్యపు పందిరి వాహనంపై భక్తులకు స్వామివారు కనువిందు చేయనున్నారు. శుక్రవారం రాత్రి సరస్వతి దేవి అలంకారంలో హంస వాహనంపై భక్తులకు అభయమిచ్చారు. వాహనం ముందు వృషభాలు, అశ్వాలు, గజరాజులు నడుస్తుండగా, భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది.
భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. హంస వాహనసేవలో శ్రీ గోవిందరాజ స్వామివారు జ్ఞానమూర్తిగా ప్రకాశించారు. ఐతిహ్యానుసారం బ్రహ్మ వాహనమైన హంస జ్ఞానానికి ప్రతీక. పాలను, నీళ్లను వేరుచేసే విచక్షణ దీని స్వభావం. ఇది ఆత్మానాత్మ వివేకానికి సూచకం. అందుకే ఉపనిషత్తులు పరమాత్మతో సంయోగం చెందిన మహనీయులను పరమహంసగా అభివర్ణిస్తున్నాయి. శ్రీవారు భక్తులలో అహంభావాన్ని తొలగించి జ్ఞానసిద్ధి, బ్రహ్మపద ప్రాప్తి కలిగించేందుకే హంస వాహనాన్ని అధిరోహిస్తాడని పురాణాలు చెబుతున్నాయి.