అజామిళుడి కథ తెలుసుకున్నాం. సత్ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన అతడు చేయని దారుణమంటూ లేదు. తల్లిదండ్రుల గారాబం కారణంగా సకల పాపములు చేశాడు. పరస్త్రీ వ్యామోహంలో తల్లిదండ్రులను వదిలేశాడు. దైవారాధన పూర్తిగా మానేశాడు. కుమార్తెతోనే సంబంధం పెట్టుకుని ముగ్గురు పిల్లల్ని కన్నాడు. అజామిళుడు బ్రాహ్మణుడై ఉండి కూడా కులభ్రష్టుడై జీవహింసలు చేసి మహాపరాధం చేశాడు. అలాంటి పాపాత్ముడిని మీరు విష్ణు లోకమునకు ఎలా తీసుకుని వెళ్తున్నారని నరక దూతలు విష్ణు దూతలను ప్రశ్నించారు.
అప్పుడు విష్ణుదూతలు ఏం సమాధానం చెప్పారంటే ముందుగా.. యమ దూతలు అవివేకులని, వారికి ధర్మసూక్ష్మములు తెలియవని నిందించారు. సజ్జనులతో సహవాసం చేయు వాడు, జప, దాన ధర్మములు చేయువాడు, అన్న దానము, కన్యా దానము, గోదానము, సాలగ్రామము దానం చేయువాడు, అనాధ ప్రేత సంస్కారం చేయువాడు, మరణకాలమునందు “హరీ” అని శ్రీహరిని, “శివా” అని ఈశ్వరుని స్మరించినవారును పుణ్యాత్ములని విష్ణుదూతలు తెలిపారు. ఈ అజామిళుడు తెలిసికాని, తెలియకగాని తన మరణ సమయమున నారాయణుడి నామ జపం చేశాడని కాబట్టి అతనిని తాము వైకుంఠమునకు తీసుకునివెళ్తున్నామని వెల్లడించారు.