అరుంధతి నక్షత్రం మనకు ఎప్పుడు కనిపిస్తుంది? ఏ ఆకారంలో ఉంటుంది?

సంస్కృత భాషలో ‘అరుం’ అంటే అగ్ని, తేజము, బంగారువన్నె అనే అర్థాలున్నాయి. ‘ధతీ’ అంటే ధరించినదనే అర్థం ఉంది. అగ్నినుంచి తిరిగి పుట్టింది కనుక ఆమె ‘అరుంధతి’ అయింది. పరమేశ్వర వరప్రసాదమైన అరుంధతిని యాగకర్త అయిన మేధాతిథి పెంచి పెద్ద చేసి, వశిష్టునికి ఇచ్చి వివాహం చేశాడు. అరుంధతి తన పాతివ్రత్య మహిమ వల్ల త్రిలోకపూజ్యురాలైంది. అరుంధతి వశిష్ఠ మహర్షి ధర్మపత్ని, మహా పతివ్రత అని ఆకాశం వంక పెళ్ళి సమయంలో చూపించి చెబుతారు బ్రాహ్మణులు. అలా చేస్తే మీ సంసారిక జీవనం అన్యోన్యనురాగాలతో సుఖమయమవుతుందని పండితులు వధూవరులకు చెబుతారు.

మాఘ మాసాది పంచ మాసాల కాలమందు తప్ప ఈ నక్షత్రం సాయంత్రవేళ కానరాదు. రాత్రి పూట చంద్రుడ్ని, నక్షత్రాలను చూడటం వల్ల కంటి శక్తి పెరుగుతుంది. అరుంధతి నక్షత్రం నుంచి వచ్చే కిరణాల వల్ల కంటి శక్తి మరింత పెరుగుతుంది. అరుంధతి నక్షత్రం సప్తర్షిమండలంలో వుండే చిన్న నక్షత్రం. శిశిర, వసంత, గ్రీష్మఋతువులందు సాయంకాల సమయాన, మిగిలిన కాలాల్లో అర్థరాత్రి లేదా దాటిన తర్వాత తెల్లవారు జామున కనిపిస్తుంది.

అరుంధతి నక్షత్రాన్ని చూడాలనుకుంటే జాగ్రత్తగా ఆకాశం వంక చూడండి. ‘?’ మార్కు ఆకారంలో నక్షత్రాలు ఉంటాయి. ఖచ్చితంగా కాకపోయినా దాదాపుగా ఆ ఆకారంలో ఉంటుంది. అలా ఉండే సప్తర్షి మండలంలో పక్కపక్కనే ఉండే నక్షత్రాలే అరుంధతి, వశిష్ఠులవారివి. అరుంధతి నక్షత్రం చిన్నగా ఉంటుంది.

Share this post with your friends