
మాఘ మాసం జనవరి 19 సోమవారం నుంచి ప్రారంభమై ఫిబ్రవరి 17 వరకు కొనసాగనుంది. ఈ మాసం హిందువులకు అత్యంత పవిత్రమైన మాసం. ఈ మాసంలో నదీస్నానం చేస్తే అపారమైన పుణ్యం లభిస్తుందని చెబుతారు. ముఖ్యంగా గంగా, యమున, గోదావరి, కావేరి, నర్మదా, సింధు వంటి పుణ్య నదుల్లో స్నానమాచరిస్తే పుణ్యం లభిస్తుందని మాఘ పురాణం చెబుతోంది. అలాగే మాఘ స్నానం గురించి బ్రహ్మాండ పురాణంలోనూ వివరించారు. అంతేకాకుండా ఈ మాసం యజ్ఞయాగాది క్రతువులకు శ్రేష్ఠమైనది.
మృకండ మహర్షి, మనస్విని దంపతులు ఈ మాఘస్నానం ఆచరించి తమ పుత్రుడైన మార్కండేయునికి అపమృత్యు దోషాన్ని తొలగించుకున్నారని పురాణాలు చెబుతున్నాయి. ఈ మాసంలో నిత్యం భగవద్గీత పఠనం, సూర్యుని ఆరాధన, నదీ స్నానం, దానధర్మాలు వంటివి మంచి ఫలితాన్నిస్తాయి. సర్వ పాపాలు తొలగి మోక్షం లభించాలంటే మాఘ స్నానం వల్లనే సాధ్యమవుతుందట. అలాగే నిత్యం తులసి కోట వద్ద దీపం వెలిగించాలి. ఈ మాసంలో నిత్యం తులసిని పూజించడం వల్ల దుష్ట శక్తులు ఇంట్లోకి ప్రవేశించవని చెబుతారు.
