
ఈ పవిత్రోత్సవంలో పూసలుగా అమర్చబడిన మాలలను ప్రతిష్టించి శ్రీ వేంకటేశ్వర స్వామివారికి, ఆలయపరివార దేవతలకు సమర్పించటం ప్రధానఘట్టం. పవిత్ర సూత్రాలను పవిత్రమండపంలోని పీఠంలో ఉంచి వాటిని దర్భకొసలతో కూడిన పంచగవ్యాలతో ప్రోక్షణ చేసి ఆగమోక్త విధానంగా వాటిని ప్రతిష్టించి ఉక్తహోమం జరిపి ఉత్సవమూర్తులకు అష్టకలశ స్నపనం జరిపి ధ్వజ ఛత్ర చామర పింఛ నృత్య గేయ సమాయుక్తంగా ఆచార్యుడు ఆలయ ప్రదక్షిణం చేసి దేవదేవుణ్ణి విశేషంగా అర్చించి అష్టోత్తరశత పవిత్ర సూత్రాలను పర్యంతం సమర్పించడం ఉత్తమం.
చతుః పంచాశత్ (54) సూత్రములను ఊరువుల వరకు సమర్పిస్తే మధ్యమం. సప్తవింశతి (27) సూత్రాలను నాభ్యన్తం సమర్పిస్తే అధమం అని ఆగమోక్తం. వీటిలో యథాశక్తి సమర్పించాలి. పవిత్రములను ఈ విధంగా దేవ దేవునికి ఆరోపణ చేయటమే పవిత్రారోపణం. ఇదే విధంగా పరివారదేవతలకు కూడా ఒక్కొక్కరికీ సమర్పించాలి. ముందుగా అంకురార్పణ చేయాలి. ఇది దాదాపు అన్ని ప్రధాన ఆలయాలలోనూ సంవత్సరానికి ఒకసారి తప్పనిసరిగా జరిపించవలసిన ఉత్సవం.
తిరుమలలో వేంచేసి ఉన్న అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, ఆశ్రితజన వత్సలుడు అయిన శ్రీమన్నారాయణునికి వైఖానసాగమోక్తంగా ఈ పవిత్రోత్సవం భక్తితో చేయించినా, కళ్లారా దర్శించినా భక్తులు సర్వ పాపల నుంచి విముక్తి పొంది యశస్సు, సంపద, సంవత్సరార్చన ఫలం, విష్ణుసాయుజ్యం, అశ్వమేధయాగ ఫలం, సర్వోపద్రవనివారణయేగాక సర్వాభీష్టఫలాలు పొంది నిర్భీతులై, ధర్మ తత్పర నిష్టాగరిష్టులై సుఖిస్తారని భృగు సంహిత చెబుతోంది.
పవిత్రోత్సవం అనే మాటకు పవిత్రీకరణ కార్యక్రమమని పేరు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించేముందు వ్రేలికి దర్భతో చేయబడిన పవిత్రం ధరించి కార్యక్రమం జరపడం అలవాటు. దీనివల్ల కార్యక్రమానికి మానసికంగా యజమానికి నిర్మలతత్త్వం చేకూరుతుందనేది సంప్రదాయం.
