మద్దిలేటి నరసింహస్వామి గురించి తెలుసుకున్నాం కదా. ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లాకు 65 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంటుంది. గతంలో ఈ స్వామివారిని కదిరి నరసింహస్వామి అని పిలిచేవారు. ఈ ఆలయ కథేంటో తెలుసుకుందాం. ఒకసారి కదిరి నరసింహస్వామి ఏకాంతంలో లక్ష్మీదేవితో పాచికలు ఆడి ఓడిపోతారు. అయితే స్వామివారిని ఓడించడంతో అమ్మవారికి విజయగర్వం వచ్చేసింది. దీంతో స్వామిని అమ్మవారు హేళన చేశారు. దీనిని అవమానంగా భావించిన స్వామివారు ఇక మీదట అక్కడ ఉండలేక ప్రశాంత వాతావరణంలో కొలువుదీరాలని నిర్ణయించుకున్నారట. అందుకు అనువైన ప్రదేశం కోసం ఎర్రమల, నల్లమల అటవీ ప్రాంతంలో వెదికారట.

చివరకు తను కొలువవడానికి ప్రశాంత వాతావరణం దొరకలేదట. దీంతో ప్రశాంత ప్రదేశాన్ని సూచించమని యాగంటి ఉమా మహేశ్వరుని కోరాడట. అప్పుడు ఉమా మహేశ్వరుడు మద్దిలేరు వాగు పక్కన కొలువు తీరాలని నరసింహ స్వామికి సూచించాడట. ఆ సమయంలో మద్దిలేరుకు మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న మోక్ష పట్టణాన్ని కన్నప్ప దొర పరిపాలిస్తూ ఉండేవాడు. ప్రతి శనివారం వేటకు వెళ్లడం కన్నప్ప అలవాటు. అయితే ఒక శనివారం వేట పూర్తి చేసుకుని వస్తుండగా.. అడవిలో ఒక ఉడుము కనిపించింది. దానిని పట్టుకోమని భటులకు చెప్పగా వారు పట్టుకోబోతో అది కోమలి పుట్టలోకి ప్రవేశించింది. భటులు చేసేదేమీ లేక తిరిగొచ్చారు. ఆ రోజు రాత్రి కన్నప్ప దొరకు స్వప్నంలో నరసింహ స్వామి కనిపించి పగలు ఉడుము రూపంలో కనిపించింది తానేనని చెబుతాడు. తనకు పూజలు నిర్వహిస్తే తాను పదేళ్ల బాలుడి రూపంలో వెలుస్తానని చెప్పగా కన్నప్ప దొర వేద పండితులతో కలిసి వెళ్లి పూజలు నిర్వహించగా.. తాను అక్కడే వెలుస్తానని చెప్పి నరసింహ స్వామి అదృశ్యమయ్యాడు.
