కార్తీక మాస మహోత్సవంలో భాగంగా నారాయణ నామ స్మరణ మహత్స్యాన్ని అజామిళుని కథ ద్వారా తెలుసుకున్నాం కదా. జనక మహారాజుకు వశిష్టుల వారు ఈ కథలను వివరిస్తున్నారు. అజామిళుని మరణానంతరం యమదూతలు యమ లోకానికి తీసుకెళ్లడం.. ఆపై అజామిళుడు నారాయణ నామ స్మరణ చేయడంతో విష్ణు భటులు అతనికి పాప విముక్తి కలిగిందని రావడం.. ఆపై అతడిని విష్ణు లోకానికి తీసుకెళ్లడం గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు అజామిళుని కోసం వచ్చిన విష్ణుదూతలు, యమ దూతల మధ్య సంవాదం గురించి తెలుసుకుందాం.
అజామిళుని కోసం వచ్చిన విష్ణుదూతలు, యమ దూతలతో తాము విష్ణు దూతలమని.. వైకుంఠం నుంచి వచ్చామని చెబుతారు. మీ ప్రభువగు యమధర్మరాజు ఎటువంటి పాపాత్ములను తీసుకురమ్మని మిమ్మల్ని పంపించారని ప్రశ్నించారు. దీనికి సమాధానంగా మానవుడు చేయు సకల పాప పుణ్యాలను పంచభూతాలు, రాత్రింబవళ్లు, సంధ్యాకాలం సాక్షులుగా ఉండి ప్రతిదినమూ పర్యవేక్షిస్తారని విష్ణుదూతలతో యమదూతలు చెప్పారు. అనంతరం తమ ప్రభువు దగ్గరకు వచ్చి వాటిని తెలియచేస్తూ ఉంటారని వెల్లడించారు. యముడు వీటన్నిటిని చిత్రగుప్తుని సాయంతో లెక్కించి ఆ మనుజుని మరణ కాలమున మమ్ము పంపి వారిని ఇక్కడకి రప్పిస్తారని యమదూతలు తెలిపారు.