జ్ఞాన నిధిగా హనుమను ఎందుకు చెబుతారంటే..

కార్యసాధకుడికి పట్టుదల ఒక్కటే ఉంటే సరిపోదు. దానికి ఓర్పు, నేర్పు సమపాళ్లలో జతకలవాలి. సహనం ఎంత ముఖ్యమో సమయస్ఫూర్తి కూడా అంతే అవసరమన్నది గ్రహించాలి. హనుమంతుడిలో ఈ లక్షణాలన్నీ పుష్కలంగా ఉన్నాయి. సీతాన్వేషణకు ముందు రాముడు ఆంజనేయుడిలో గమనించిన విషయం కూడా ఇదే. శాస్త్రరీత్యా హనుమ శబ్దానికి వాక్యకోవిదుడు, జ్ఞాని అనే విశేషార్థాలు ఉన్నాయి. హనుమ ఓ జ్ఞాననిధి. ఆయన వ్యక్తిత్వం సామాన్యమైనది కాదు. వివేకం, ప్రతిభ, సమయస్ఫూర్తి, సంయమనం మొదలైనవి హనుమలో పరిపూర్ణంగా ఉన్నాయి. అయితే జ్ఞానం కలిగి ఉంటే సరిపోదు. దాన్ని తగినవిధంగా సమయానికి వినియోగించడమన్నది ముఖ్యం.

జ్ఞాన నిధిగా హనుమను ఎందుకు చెబుతారంటే..
జ్ఞాన నిధిగా హనుమను ఎందుకు చెబుతారంటే..

బుద్ధిబలాన్ని ఎక్కడ ఉపయోగించాలో, ఎక్కడ పరాక్రమం ప్రదర్శించాలో, ఆలోచించి ఎక్కడ అడుగు ముందుకు వేయాలో హనుమకు బాగా తెలుసు. ఆయన మాటతీరు సుస్పష్టం. ఏదైనా ఒక విషయం గురించి మాట్లాడుతున్నప్పుడు వీనుల విందుగా మాట్లాడేవాడు. ఇంకా ఇంకా వినాలనిపించేలా ఉండేదట ఆ మాట. అతిగానో, మరీ క్లుప్తం గానో చెప్పకుండా విషయం అర్థమయ్యేలా వివరించడం ఆయనలోని ప్రత్యేకత. వినయశీలురే విజయానికి చిరునామాగా నిలుస్తారు. హనుమలో ఈ గుణం పరిపూర్ణంగా ఉంది. ‘హనుమంతుడు ఉంటే అందరూ బతికి ఉన్నట్టే. ఆయన లేకుంటే ఎవరూ లేనట్టేనని’ ఓ సందర్భంగా జాంబవంతుడన్న మాటల్లో ఎంతో పరమార్థం ఉంది. శ్రీరామ కార్యాన్ని అంకిత భావంతో సాధించి శ్రీమద్రామాయణ కావ్యంలోని సుందరకాండలో దేదీప్యంగా వెలుగుతున్నాడు హనుమంతుడు. జ్ఞాన నిధి హనుమ నిత్యపూజనీయుడు.

Share this post with your friends