
సంధ్యను చూసి బ్రహ్మతో సహా అందరూ మోహానికి గురవడంతో వాగ్దేవి ఈశ్వరుడిని ప్రార్థించడంతో పరిస్థితిని చక్కదిద్దాడు. రెప్పపాటు కాలంలో జరిగిన తప్పుకు తలవంచిన సృష్టికర్త కోపంతో ఈశ్వరుని నేత్రాగ్నిలో పడి భస్మమవుతావని మన్మథుడికి శాపం ఇచ్చాడు. తన వల్ల ఇంతమంది నిగ్రహం కోల్పోయారని సంధ్య , చంద్రభాగా నదీ తీరంలో తపస్సు పేరిట తనువు చాలించేందుకు పయనమైపోయింది. అప్పుడు బ్రహ్మ వశిష్ట మహామునిని పిలిచి సంధ్యకు తపోదీక్షను అనుగ్రహించాలిందిగా కోరాడు. వశిష్టుడు ఆమెకు శివ మంత్రానుష్టానం వివరించి తన ఆశ్రమానికి వెళ్లిపోయాడు. సంధ్య తదేక నిష్టతో తపమాచరించి శివుని అనుగ్రహాన్ని పొందింది. శివుడు ఆమెను వరం కోరుకొమ్మన్నాడు.
ఈ లోకంలో సమస్త ప్రాణులకు యవ్వనం వచ్చేదాకా కామవికారం కలగరాదనే వరాన్ని ఆమె కోరుకుంది. శివుడు ఆమెను మరొక వరాన్ని కూడా కోరుకోమన్నాడు. అపుడు సంధ్య నా భర్త తప్ప పరపురుషుడెవరైనా నన్ను కామదృష్టితో చూచినట్లయితే వారు పుంసత్వాన్ని కోల్పోవాలనీ, అంతేకాక, తాను పుట్టగానే అనేకమందికి కామ వికారం కలిగించాను కనుక ఈ దేహం నశించిపోవాలని కోరుకుంది. శివుడు తథాస్తు అంటూ, ‘మేధతిథి అనే మహర్షి గత పుష్కరకాలంగా యాగం చేస్తున్నాడు. ఆయన చేస్తున్న యాగకుండంలో అదృశ్యరాలివై శరీరాన్ని దగ్ధం చేసుకుని, తిరిగి అదే అగ్నికుండం నుంచి నీవు జన్మిస్తావు అని అంతేగాక నీ శరీరం నశించే సమయంలో ఎవరినైతే భర్తగా తలుస్తావో అతడే నీ భర్త అవుతాడ’ని చెప్పి అంతర్థానమయ్యాడు. శివాజ్ఞగా సంధ్య తన శరీరాన్ని అగ్నికుండంలో దగ్ధం చేస్తూ వశిష్టుడే తన భర్త కావాలని కోరుకుంది. అగ్నికుండంనుంచి తిరిగి జన్మించింది.
