స్వాతంత్ర్య ఉద్యమంలోనూ కీలక భూమిక పోషించిన దుర్గామాతకు పూజలు..

1757లో జరిగిన ప్లాసీ యుద్ధంలో రాబర్ట్‌ క్లైవ్‌ సారథ్యంలోని ఈస్టిండియా కంపెనీ సేన బెంగాల్‌ నవాబు సిరాజుద్దౌలాను ఓడించి బెంగాల్‌పై పట్టు సంపాదించిన విషయం తెలిసిందే. భారత్‌లో తొలి విజయానికి ప్రతీకగా దుర్గామాతకు పూజచేసి అక్కడి వారంతా విజయోత్సవం జరుపుకున్నారు. ఈ ఉత్సవాలు క్రమంగా జాతీయోద్యమానికి ఊతమయ్యాయి. అప్పటివరకూ దసరా మహోత్సవం అంటే కేవలం ఇళ్లలో మాత్రమే పూజలు జరుపుకునేవారు. ప్లాసీ యుద్ధానంతరం మాత్రం ఈ దసరా శరన్నవరాత్రులు క్రమంగా సామాజిక రూపం దాల్చడం కీలక పరిణామంగా చెప్పవచ్చు. ఈస్టిండియా రాకతో బెంగాల్‌లో జమీందార్లు, సంపన్నులు తమ ఆధిపత్యాన్ని, ప్రభుత్వంలో పట్టును, దర్పాన్ని చాటడానికి కీలకభూమిక పోషించారు. ఈ ఉత్సవాలను వారంతా వేదికలుగా చేసుకున్నారు.

తమ అధికారానికి కూడా ఈ ఉత్సవాలు దోహదం చేస్తుండటంతో ఈస్టిండియా కంపెనీ అధికారులూ ప్రోత్సహించారు. ఈ క్రమంలోనే గవర్నర్‌ జనరల్‌ లార్డ్‌ వెస్లీ కాళీమాతకు గౌరవప్రదంగా తొమ్మిది తుపాకుల శాల్యూట్‌ను ప్రవేశపెట్టారు. అలా జమీందార్ల పర్యవేక్షణలో సాగిన దుర్గా పూజ జాతీయోద్యమం ప్రభావంతో సామాన్య ప్రజల ఉద్యమంగా మారింది. 1919లో జమీందార్లకు సంబంధం లేకుండా సామాన్య ప్రజానీకం దుర్గాపూజ నిర్వహించింది. దీన్ని బరోయారి పూజ అంటారు. అనంతరం బాగ్‌బజార్‌లో సర్వజన పూజ మొదలైంది. వీటిలో క్రమంగా జాతీయోద్యమ నాయకులు, విప్లవనాయకులు కూడా ప్రవేశించడంతో ఉత్సవాలు పెద్ద ఎత్తున జరిగేవి. 1930లో కోల్‌కతా మేయర్‌గా ఉన్న నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ సర్వజన పూజను ముందుండి నడిపించారు. జాతీయోద్యమ ప్రచారానికి, స్వదేశీ వస్తువుల ప్రోత్సాహానికి ఈ ఉత్సవాలు వేదికగా మారాయి.

Share this post with your friends