
వేదకాలం నుంచి ఋషీశ్వరులు సరస్వతి దేవిని అర్చామూర్తిగా కొలుస్తున్నారు. సరస్వతీ దేవి అవతార ప్రాధాన్యం ఏంటంటే.. ఓంకారం నుంచే సర్వవిద్యలు సృష్టికి ఆధారమైన ప్రణవనాదం నుంచి ఉత్పన్నమయ్యాయని పురాణాలు చెబుతున్నాయి. ప్రణవనాదం అంటే సరస్వతీ రూపమే. అప్పటి నుంచి అమ్మవారిని చదువుల తల్లిగా.. సకల విద్యలకు ఆధారంగా కొలుచుకోవడం జరుగుతోంది. వాణి, శారద వంటి పేర్లతో పూజించబడుతున్న సరస్వతీ దేవిని సృష్టికారకుడైన బ్రహ్మ సంకల్పశక్తిగా చెబుతారు. అమ్మవారి వాహనం వచ్చేసి హంస. పాలను, నీళ్లను ఇది వేరు చేస్తుంది. ఇలాంటి శక్తి సృష్టిలో హంసకు ఒక్కదానికే ఉంది.
హంస చెప్పే సత్యం ఏంటంటే.. సరస్వతీ దేవి ప్రపంచంలో సదసత్తులను విడదీసి, సద్వస్తువైన జ్ఞానాన్ని ప్రసాదిస్తుందట. పాల వంటి తెల్లని దేహంతో చేతిలో వీణతో అమ్మవారు ప్రశాంతతకు చిహ్నంగా కనిపిస్తారు. తెలుపు అనేది సప్త వర్ణాల కలయిక. సరస్వతీ దేవి వేదాలకు మూలంగా చెబుతారు. సరస్ అంటే శబ్దం, చలనం, ప్రవాహమని అర్థం. అమ్మవారు ప్రతి ఒక్కరి నాలుకపై నివసిస్తుందని చెబుతారు. జ్ఞానాన్ని ప్రసాదించే తల్లిగా సరస్వతీదేవిని కొలుస్తారు. కాబట్టి అక్షరాభ్యాసాలన్నీ అమ్మవారి సమక్షంలోనే నిర్వహిస్తూ ఉంటారు.
