ఈ ఆలయ చరితం ఓ అద్భుతమని చెబుతారు. రేజింతల్ గ్రామ శివారులో ఈ సిద్ధి వినాయక దేవస్థానం ఉంటుంది. దీనిని 225 సంవత్సరాల క్రితం నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. ఒకప్పుడు దట్టమైన కీకారణ్యంగా ఉండే ఈ ప్రాంతానికి కర్ణాటక రాష్ట్రానికి చెందిన గణపతి భక్తుడు చింతల గిరి శివరాం పంతులు వచ్చాడట. ఆయన అనేక సంవత్సరాలు గణపతి అనుగ్రహం కోసం హిమాలయాల్లో తపస్సు చేసి ఉన్నారట. శివరాం పంతులు రేజింతల్కు రాగానే గొప్ప ప్రశాంతత లభించిందట! అప్పుడు ఆయన చాలాకాలం ఈ ప్రాంతంలోనే తపస్సు చేసుకుంటూ ఉండిపోయాడట. ఒకరోజు ఆయనకు ధ్యానంలో వినాయకుడు దర్శనమిచ్చాడట.

తన ఉనికిని తెలిపి తనకు ఆలయాన్ని నిర్మించి పూజాదికాలు జరిపించమని ఆదేశించాడంట. గణపతి చెప్పిన ప్రకారమే శివరాం పంతులు ఆ ప్రాంతంలో అన్వేషించగా.. స్వయంభువుడుగా వెలసిన సిద్ధి వినాయకుని ప్రతిమ కనిపించిండట. వెంటనే ఆ విగ్రహాన్ని వెలికితీసి ఆలయాన్ని నిర్మించి పూజాదికాలు ప్రారంభించాడు. అప్పటి నుంచీ రేజింతల్ సిద్ధి వినాయకుడు మహావైభవంగా భక్తుల పూజలు అందుకుంటున్నాడు. అలాగే నిత్యం సింధూర వర్ణంతో కళకళలాడుతూ భక్తకోటిని అనుగ్రహిస్తూనే ఉన్నాడు. తొలినాళ్లలో రెండున్న అడుగుల ఎత్తు.. మూడడుగుల వెడల్పు మాత్రమే ఉన్న ఈ వినాయకుడు ఇప్పుడు ఐదున్నర అడుగుల ఎత్తు, ఆరడుగుల వెడల్పు అయ్యాడు. అందుకే ప్రతి ఏటా నువ్వు గింజంత పరిమాణంలో ఈ గణపతి పెరుగుతున్నాడని చెబుతారు.
