
కాకభూషుండి కథను విన్నాం కదా. ఇప్పుడు మరికొన్ని విషయాలను తెలుసుకుందాం. తులసీదాసు తన మానస చరిత్రలో కాకభూషుండి అత్యంత జ్ఞానవంతుడైన రాముని భక్తుడని తెలిపారు. కాకభూషుండి ఎందుకు కాకిలా ఉండి పోవచ్చిందంటే.. అదొక మహర్షి శాపమని పేర్కొంటారు. అలాగే గరుత్మంతుడి గురువని కూడా చెబుతారు. ఒకసారి గరుడుడికి ప్రపంచంలో అత్యంత గొప్ప భక్తి మార్గం ఏదనే సందేహం వచ్చిందట. ఆ సమయంలో గరుడుడికి కకభూషుండి రామకథను గురించి వివరించాడని చెబుతారు. రాముడిని కాకభూషుండి స్వయంగా చూశాడు కాబట్టి అదొక అనుభవంగా పేర్కొంటారు.
కాకభూషుండి ఎందుకు కాకిగా జన్మించాడు? అంటే దానికో కథ ఉంది. పార్వతీదేవికి పరమశివుడు శ్రీరాముని కథను వివరించినట్టుగా అమరత్వ రహస్యం పురాణం చెబుతోంది. అప్పుడు ఆ కథను కాకి కూడా విన్నది. అదే కాకి మరో జన్మలో కాకభూషుండిగా పుట్టాడు. అయితే కాకభూషుండి శివుడు చెప్పిన శ్రీరాముని కథ మరో జన్మలో సైతం గుర్తుండిపోయింది. శ్రీరాముడి కథను ఇతర వ్యక్తులకు సైతం కాకభూషుండి వివరించాడు. శివుడు చెప్పిన కథను ఆధ్యాత్మ రామాయణం అని కూడా చెబుతారు. ఈ ఆధ్యాత్మ రామాయణాన్ని విన్న కాకభూషుండి మరణానికి అతీతమైన జ్ఞానాన్ని పొంది అమరుడయ్యాడని చెబుతారు. అలా కాకభూషుండి ప్రతి కాలానికి, యుగానికి సాక్షిగా మారాడు.
