తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లాలోని మన్యంకొండ దేవస్థానం చరిత్ర గురించి తెలుసుకుందాం. దాదాపు 600 సంవత్సరాల క్రితం తమిళనాడులోని శ్రీరంగం సమీపంలో అళహరి అనే గ్రామం ఉండేది. ఆ గ్రామానికి చెందిన కేశవయ్యకు శ్రీనివాసుడు స్వప్నంలో కనిపించాడట. తాను మన్యంకొండపై వెలసి ఉన్నానని చెప్పాడట. వెంటనే అక్కడకు వెళ్లి తనకు నిత్యసేవాది కార్యక్రమాలు నిర్వహించాలని కేశవయ్యను ఆదేశించి అంతర్ధానం అయ్యాడంట. శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆదేశంతో కేశవయ్య మరునాడే తన కుటుంబంతో కలిసి మన్యంకొండ సమీపంలోని కోటకదిరలో నివాసం ఏర్పరచుకున్నాడు.

ప్రతిరోజూ కేశవయ్య మన్యం గుట్టపైకి వెళ్లి శ్రీనివాసునికి సేవలు చేస్తూ తరించసాగాడు. అలగే దైవచింతన అధికంగా ఉన్న కేశవయ్య దక్షిణాదిన ఉన్న అన్ని తీర్ధయాత్రలు సైతం చేస్తూ ఉండేవాడట. అలా పుణ్యక్షేత్రాలు సందర్శిస్తూ ఉండగా ఒకరోజు కృష్ణా నదిలో స్నానం చేసి సూర్యునికి అర్ఘ్యం సమర్పిస్తున్నాడట. అప్పుడు శిలా రూపంలో ఉన్న వేంకటేశ్వరస్వామి విగ్రహం వచ్చి కేశవయ్య దోసిలిలో పడిందట. దానిని తీసుకొచ్చి మన్యంకొండపై శేషసాయి రూపంలో ఉన్న గుహలో ప్రతిష్టించాడట. అప్పటి నుంచి నిత్య ధూప, దీప నైవేద్యాలతో పూజిస్తూ ఉండేవాడు. ఈ ఆలయంలోనే ఆంజనేయస్వామితో పాటు గరుడాళ్వార్ విగ్రహాన్ని సైతం ప్రతిష్టించాడు.
