ధర్మరాజు ఇంద్రప్రస్తాన్ని పరి పాలిస్తున్న రోజులవి. ఒకరోజు ఒక బ్రాహ్మణుడు సహాయార్థం వచ్చాడు. ధర్మరాజు మరునాడు రావాల్సిందిగా అతడికి చెప్పి పంపించేసాడు. అతడు విచారంగా వెనుతిరిగి వెళుతూ ఉండగా ద్వారం వద్ద భీముడు ఆ బ్రాహ్మణుని ఆపాడు. ఇక్కడకు వచ్చిన వారెవరూ ఖాళీ చేతులతో తిరిగి వెళ్లడం భీముడెప్పుడూ చూడలేదు. “బ్రాహ్మణోత్తమా! తమరు వచ్చిన పని పూర్తయినదా?” అని అడిగాడు. భీమసేనుడు ఆశ్చర్యంతో “అయ్యా! లేదు. రేపు రావాల్సిందిగా ఆజ్ఞ అయినది” అన్నాడు. “తన అన్నయ్య ఒక మంచి పనిని మరురోజుకి వాయిదా వేసినాడు?” అని కొన్ని క్షణాలు ఆలోచించాడు.

అనంతరం చకచకా ప్రధాన ద్వారము వద్ద వేలాడదీయబడిన గంట దగ్గరకు చేరుకుని పదేపదే మోగించసాగాడు. భీముడు అత్యంత బలశాలి కదా గంట శబ్దము మరీ భయంకరంగా వుండడంతో అందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ధర్మరాజు సభాస్థలి నుంచి హడావిడిగా వచ్చాడు. అర్జునుడు తన ఆయుధాలు వదిలి పరుగెత్తుకు వెళ్లాడు. నకుల, సహదేవులు తాము చదువుతున్న గ్రంధాలు వదిలి ప్రధాన ద్వారం దగ్గరకు బయలుదేరారు. ద్రౌపది వంట గది వదిలి ఆత్రుతగా భీమసేనుడున్న చోటుకు చేరుకున్నది. ధర్మరాజు గట్టిగా “ఇక ఆపు భీమసేనా! అందరం ఇక్కడే వున్నాం. సంగతేంటో చెప్పు” అన్నాడు. భీముడు అన్నకు నమస్కరించి అక్కడ మూగిన జనాలకేసి తిరిగి “మా అన్నయ్య సాధించిన గొప్ప విజయం గురించి మీకు చెప్పదలిచాను. అతడీవేళ మృత్యువును గెలిచాడు. మృత్యుంజయుడైనాడు” అన్నాడు. ధర్మరాజు ప్రశ్నార్థకంగా చూశాడు.
“ఏమంటున్నావు భీమసేనా? నేనీ వేళ బయటకు వెళ్లనేలేదు. ఏ శత్రువుతోనూ తలపడనూలేదు. నేను విజయం సాధించడమేమిటి ? నీకు కల గాని రాలేదు కదా! అన్నాడు. అప్పుడు భీమసేనుడు గట్టిగా నవ్వాడు. “లేదన్నా! మీ గొప్పదనం మీకు తెలియదు. మానవునికి అలవికాని మృత్యువును మీరు జయించారు. ఆ బ్రాహ్మణోత్తముడు యాచనకు రాగా అతణ్ని మర్నాడు కదా రమ్మని ఆదేశించారు? అనగా అర్థం- రేపటి వరకూ మీరు, బ్రాహ్మణోత్తములు బ్రతికి వుంటారని నిర్థారణకు వచ్చినట్లే కదా! అందుకే అన్నా! మీరు మృత్యువును జయించారని ప్రకటించాను.” అన్నాడు. ధర్మరాజుకు విషయం అర్థమైంది. తాను చేసిన తప్పు తెలిసినది. సిగ్గు పడుతూ.. “నాయనా, భీమసేనా! ఇపుడు వాస్తవం నాకు ద్యోతకమైంది. మంచి పనులు వాయిదా వేయడమంత చెడ్డ పని వేరొకటి వుండదు.” అని చెప్పాడు. ఆ వెంటనే ధర్మరాజు బ్రాహ్మణోత్తమునికి వలసిన సహాయము చేసి సంతృప్తి పరిచి పంపించాడు.
