ధ్యానంలో పట్టు సాధించిన భక్తులకు అమ్మవారు గజ్జెల చప్పుళ్ల రూపంలో వారిని ఎప్పుడూ అనుసరిస్తూ ఉంటుందట. శారదాదేవి జీవితంలో సైతం అమ్మవారి దర్శనాలు అయ్యాయని చెబుతారు. అంతేకాదు ఆమె భక్తికి నిదర్శనంగా అష్టలక్ష్ములు ఆమెను అనుసరించిన సంఘటనలను పేర్కొంటారు. అమ్మవారిని నమ్ముకున్న వారికి చిన్న కష్టం వచ్చినా కూడా ఏదో ఒక రూపంలో వచ్చి తొలగిస్తుందట. ఇది కేవలం ధ్యాన స్థితిలో మాత్రమే కాదు. భక్తుల సాధారణ జీవితంలోనూ.. అమ్మవారి ఏదో ఒక రూపంలో ప్రత్యక్షంగా వారికి కష్టం వచ్చినప్పుడు సాయాన్ని అందిస్తూ ఉంటుందట.

శారదాదేవికి తన భర్త రామకృష్ణ పరమహంస వద్దకు కలకత్తాకు వెళుతున్న సమయంలో మార్గమధ్యంలో తీవ్ర జ్వరం వచ్చిందట. దీంతో ఆమె స్పృహ కోల్పోయిందట. ఆ సమయంలో శారదాదేవి అలాగే తన తండ్రి పక్కన అచ్చాదన మండపంలో పడుకుని ఉన్నారట. అప్పుడు ఆమెకు గజ్జెల చప్పుళ్లు స్పష్టంగా వినిపించాయట. కళ్ళు తెరిచి చూశారట. అప్పుడు నల్లని వర్ణంలో ఉన్న ఒక దివ్య స్త్రీ శారదా దేవి వద్దకు వస్తూ కనిపించిందట. అలాంటి అందాన్ని తన జీవితంలో ఎప్పుడూ చూడలేదని శారదాదేవి తన జీవిత చరిత్రలో రాసుకున్నారు. ఆ స్త్రీ సాక్షాత్తూ పార్వతి, కాళికా దేవిల రూపమేనని పేర్కొన్నారు. శారదాదేవి పక్కనే కూర్చొని జ్వరం తగ్గిపోతుందని ఆశీర్వదించిందట. అంతే మరునాటికే జ్వరం తగ్గిపోయిందట.
