యతో ధర్మస్తతో జయః’ అనేది హిందూ ఇతిహాసం మహాభారతంలో మొత్తం 13 సార్లు వచ్చే సంస్కృత శ్లోకం. దీని అర్థం ధర్మం ఉన్న చోట విజయం ఉంటుంది. ఇది భారత సుప్రీంకోర్టు అధికారిక నినాదం కూడా. ఈ పదబంధం హిందూ ఆలోచనలో ఒక ప్రాథమిక సూత్రాన్ని నొక్కి చెబుతుంది. నీతి నిజమైన విజయానికి దారితీస్తుంది. ప్రతికూల పరిస్థితులలో కూడా నైతిక ప్రవర్తన చివరికి విజయాన్ని నిర్ధారిస్తుందనే నమ్మకాన్ని ఇది సూచిస్తుంది. ధర్మం ఎక్కడుంటే అక్కడే విజయం వరిస్తుందని అర్థం. గాంధారికి బహుసంతానవతి అని వరముంది.

ఆమెకు సంతానాపేక్ష ఎక్కువే అయినా భర్త, సంతానం అంతా ధర్మం తప్పి ప్రవర్తించినా తాను మాత్రం ధర్మపక్షపాతియై ధర్మం విషయంలో ఎక్కడా ఆమె వెనుకంజ వేయకుండా మాట్లాడగలిగిన స్థితిని పొందింది. ఒకసారి దుర్యోధనుడు వచ్చి తల్లి కాళ్లకు నమస్కరించి ‘నాకు విజయం కలగాలి’ అని ఆశీర్వచనం చేయమన్నాడు. ఆమె మాత్రం నిర్మొహమాటంగా.. “ధర్మం ఎక్కడుంటుందో అక్కడే విజయం. నీకు విజయం కావాలనుకుంటే ధర్మాన్ని నిరంతరం పట్టుకునే ధర్మరాజు పాదాలను ఆశ్రయించు. ఆయనకు వశవర్తియై ప్రవర్తించు. అప్పుడు ధర్మాన్ని నీవు పొందుతావు. దాని కారణంగా విజయాన్ని కూడా పొందుతావు తప్ప నీవు అధర్మాన్ని పట్టుకుని గెలవలేవు సుయోధనా…” అంది.
