కురుక్షేత్ర యుద్ధానంతరం యుద్ధభూమిలోకి వెళ్ళి గాంధారి చూసినప్పుడు కొడుకులందరూ మరణించి ఉన్నారు. అందునా దుశ్శాసనుడు భయంకరంగా వక్షస్థలం బద్దలయి పడిపోతే…. ఆమె కోపం అటుతిరిగి ఇటు తిరిగి ఎవరిమీద నిలబడాలో తెలియక అంతటి గాంధారి కూడా పుత్రవ్యామోహాన్ని పొంది కృష్ణుడి వంక చూసి అంది.. “అన్నీ నీకు తెలుసు కృష్ణా, వీరందరూ మరణిస్తారని నీకు తెలుసు. నువ్వే పూనుకుని ఉంటే నా కొడుకులు ఇలా చనిపోయేవారు కాదు. దీనికంతటికీ కారణం కృష్ణా నువ్వే… నీ యదువంశంలో కూడా ఇలా ఒకరితో ఒకరు కొట్టుకుని నశించి పోయెదరు గాక.. కొన్ని సంవత్సరాల తరువాత నువ్వు కూడా దిక్కులేని చావు చచ్చెదవుగాక!” అని శపించింది.

దానికి కృష్ణుడు నవ్వి “అమ్మా! ధర్మానికి వంతపాడినందుకు నాకు నువ్విచ్చే కానుకా ఇది..!!!” అన్నాడు. ఆ మాటతో అంతటి మహోన్నతమైన గాంధారి కూడా కుంచించుకు పోయింది. ఎంత చెప్పినా వినకుండా అగ్నిహోత్రాన్ని కౌగిలించుకుని మడిసిపోయిన నూరుగురు కొడుకులను చూసుకుని ఆఖరున వృద్ధాప్యంలో తల్లిదండ్రులను చూసుకోవడానికి ఒక్కడు కూడా బతకలేదు కదా… ‘ధర్మాన్ని వదిలిపెట్టి ఇంతమంది పడిపోయారా..’ అని వ్యాకులత చెంది కుంతి బిడ్డల పంచనజేరి జీవితం గడుపుతూ, భీముడనే మాటలు వినలేక ధృతరాష్ట్ర మహారాజుతో కలిసి వానప్రస్థానానికి వెళ్ళిపోయి అక్కడ దావాగ్నిలో శరీరాన్ని విడిచి పెట్టేసింది.
