మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ నుంచి 70 కిలో మీటర్ల దూరంలో నర్మదా నది ఒడ్డున కొలువైన ఓంకారేశ్వర ఆలయాన్ని మాంధాత నిర్మించాడని చెప్పుకున్నాం కదా. అసలు ఎవరీ మాంధాత తెలుసుకుందాం. పురాణాల ప్రకారం మాంధాత ఒక రాజు. ఆయన ఇంద్రుని అనుగ్రహంతో రాజ్యాధికారాన్ని స్వీకరించాడు. అయితే మాంధాత అపర శివ భక్తుడు నిత్యం శివపూజ చేయనిదే ఉండేవాడు కాదు. శివునిపై ఉన్న అచంచల భక్తి విశ్వాసాల కారణంగా మాంధాత తరువాతి కాలంలో ఈ ప్రాంతాన్ని తన రాజధానిగా ప్రకటించాడు. అందుకే ఈ ప్రాంతాన్ని ఓంకార మాంధాతగా పిలుస్తారు.

ఆ తరువాతి కాలంలో మాంధాతే శివుడికి ఆలయం నిర్మించాడని చెబుతారు. ఓంకారేశ్వరుడు కొలువై ఉన్న ఈ క్షేత్రంలో అగస్త్యుడు, అత్రి, విశ్వామిత్రుడు వంటి గొప్ప మహర్షులెందరో తపస్సు చేసారని ఆలయ స్థల పురాణం చెబుతోంది. ఇక్కడికి ఓంకారేశ్వరుని దర్శనానికి వచ్చిన భక్తులంతా నర్మదా నదికి ఆవలి ఒడ్డున ఉన్న మమలేశ్వరుని సైతం దర్శించుకుని వెళతారు. మమలేశ్వరుడు లేదంటే అమలేశ్వరుడిగా పిలుచుకునే ఈ స్వామి గర్భాలయంలో జ్యోతిర్లింగ రూపంలో దర్శనమిస్తాడు. నదికి ఇరువైపులా కొలువుదీరిన ఓంకారేశ్వరుడు, అమలేశ్వరుడిని దర్శించుకుంటే చాలు తమ జీవితం ధన్యమైందని భక్తులు భావిస్తారు.
