
ఆదివాసీలకు పెద్ద పండుగ అంటే అది దీపావళే. ఆ పండుగ నాడు గోండులకు ఆరాధ్యదైవమైన ఏత్మాసూర్ పద్మల్పురి కాకో ఆలయానికి పెద్ద ఎత్తున ఆదివాసీలు వెళుతుంటారు. ఈ ఆలయం మంచిర్యాల జిల్లా దండెపల్లి మండలంలోని గుడిరేవు గోదావరి తీరంలో కొలువై ఉంది. ఈ ఆలయానికి తెలంగాణ నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల్లోని ఆదివాసులంతా పెద్ద ఎత్తున వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. దండారీ పండుగ వేళ ఆదివాసీ గ్రామాల గిరిజనం ఒక ఊరు విడిచి మరో ఊరికి విడిదికి వెళ్లడం ఆనవాయితీ. ఐకమత్యాన్ని పెంపొందించుకోవడం కోసం ఆదివాసీలు ఇలా చేస్తుంటారు.
రాత్రి సమయంలో కాలినడకన మరో ఊరికి వెళతారు. ఇక ఆ రాత్రంత నృత్యాలు, ఆటపాటలతో ఆదివాసులంతా ఎంజాయ్ చేస్తారు. అనంతరం తదుపరి రోజున తెల్లవారగానే ఫ్రెష్ అయి.. మాన్కోలాతో నృత్య ప్రదర్శనలు చేస్తారు. సాయంత్రం సార్కోలాతో వేడుకను ముగిస్తారు. ఈ సందర్భంగా తమ గ్రామానికి వచ్చిన అథితులకు ఆ గ్రామస్తులంతా ఘన స్వాగతం పలుకుతారు. వారి కోసం ప్రత్యేక విందును ఏర్పాటు చేస్తారు. ఇలా ఎప్పటికీ తమ గ్రామాల మధ్య మంచి స్నేహబంధం కొనసాగేలా చూసుకుంటారు.
