కొన్ని దేవాలయాలు అందరికీ తెలియకపోవచ్చు కానీ చాలా పురాతనమైనవి.. ప్రత్యేకమైనవి. అలాంటి ఆలయాల్లో శ్రీరామచంద్రుని ఆలయం. శంషాబాద్ బస్టాప్ నుంచి 5 కి.మీ దూరంలో ఉంటుంది. అమ్మనపల్లిలో ఉన్న ఈ శ్రీరాముడి ఆలయం సినిమా షూటింగ్‌లకు ప్రసిద్ధి గాంచింది. హైదరాబాద్‌లోని పర్యాటక ప్రదేశాల్లో ఇది కూడా ఒకటి. ఈ ఆలయం ఈనాటిది కాదు. 13వ శతాబ్దంలో నిర్మించబడింది. ఇక స్వామివారి విగ్రహమైతే అత్యంత పురాతనమైంది. 1000 ఏళ్ల కాలానికి చెందినది. ఏడు అంతస్తుల పెద్ద గోపురం ఈ ఆలయానికి అలంకారంగా నిలిచింది. ఇక్కడి గోపుర ద్వారం మరింత ప్రత్యేకం.
దీనిపైన విష్ణుమూర్తి నిద్రిస్తున భంగిమలో చిత్రాన్ని చెక్కారు. ఇక ప్రధాన ఆలయానికి చుట్టూ పెద్ద కారిడార్ ఉంటుంది. ఏకరాతి శిలతో సీతారామ లక్ష్మణుల విగ్రహాలు రూపొందించబడ్డాయి. సాధారణంగా రాముడితో పాటు వచ్చే ఆంజనేయుడు గర్భగృహంలో కనిపించడు. బదులుగా, ఆంజనేయ స్వామి విగ్రహం శ్రీరాముడికి ఎదురుగా ద్వజస్తంభం దగ్గర ఉంచబడింది. ఈ ఆలయంలోని కోనేరు సైతం పురాతనమైనదే. ఇది చాలా పెద్దదిగానూ దీని చుట్టూ పోర్టికోలు నిర్మితమై ఉన్నాయి. కోనేరు పరిసర ప్రాంతమంతా కొబ్బరి చెట్లతో నిండి ఉన్నాయి. ఇక్కడ శ్రీరామనవమి అత్యంత వైభవంగా చేస్తారు. టాలీవుడ్ చిత్ర పరిశ్రమ ఈ ఆలయాన్ని చాలా ప్రేమిస్తుంది.