‘బెల్లం కొట్టిన రాయిలా ఉండిపోకు’ అనేది జాతీయం. దీనిని బెల్లం గడ్డల రూపంలో తయారు చేస్తారు. దాన్ని అట్లే వాడుకోలేరు. పొడి చేయాలి. రాయితో పొడి చేసి,, ఆ రాయి కాలికి తగులుతుంది. అడ్డం అని పక్కన పెట్టేస్తారు. ఇంత పని చేసిన రాయి ఒక మూల చేరుతుంది. బెల్లం కొట్టిన రాయిలా ఉంటే ఎట్లా? ఏ సంగతీ చెప్పు అంటారు. ఏదైనా సందర్భంలో విషయం తెలిసి కూడా అడిగినప్పుడు ఏమీ జవాబు చెప్పకుండా మౌనంగా ఉంటే ‘బెల్లం కొట్టిన రాయిలా ఉన్నాడు’ అంటారు.

‘బెల్లం కొట్టిన రాయిలా ఉండిపోకు’ అనే జాతీయం గురించి మరో విషయం కూడా చెబుతారు. రాయితో ఏ వస్తువును కొట్టినా, లేదా కింద పడినా శబ్దం వస్తుంది. కానీ బెల్లపు అచ్చును కొట్టినప్పుడు మాత్రం తక్కువ శబ్దం వస్తుంది. చాలాసార్లు బెల్లాన్ని ముక్కలు చేసిన తర్వాత ఆ రాయికి బెల్లం పేరుకుపోయి, ఆ రాయి కిందపడినా, వేరొక దానిని కొట్టినా శబ్దమే చేయదు. అంటే రాయి కాస్తా తన సహజమైన లక్షణాన్ని కోల్పోతుంది. అలాగే ఎన్నిసార్లు పిలిచినా / అడిగినా ఉలుకు పలుకు లేకుండా స్పందించని వారిని ‘బెల్లం కొట్టిన రాయి’ అని అంటారు.
