శ్లో𝕝𝕝 మృగమీనసజ్జనానాం తృణజలసన్తోషవిహితవృత్తీనామ్।
లుబ్ధకధీవరపిశునా నిష్కారణవైరిణో జగతి॥

-భర్తృహరిమహాకవిః-
అడవుల్లో గడ్డి తిని జీవించే లేళ్లు జింకలు, సముద్రల్లో నదుల్లో ఇతర జలాశయాల్లో స్వేచ్ఛగా జీవించే చేపలు – ఇవి ఎవరికీ హాని తలపెట్టవు. వాటి ప్రకృతి ధర్మాన్ని అనుసరించి అవి జీవిస్తుంటాయి. కానీ వేటగాడు, జాలరి వాటికి హాని తలపెడతాడు. అలాగే ఈ సమాజంలో సజ్జనులు కూడా వారి సహజ శైలిలో పరహితం కోరి నిత్యం పరోపకారం చేస్తుంటారు. అయిననూ అటువంటి వారికి కీడు తలపెట్టాలని కొందరు దుర్మార్గులు ఉంటారు కదా.
కలియుగంలో నిరంతర భగవన్నామ స్మరణకు మించిన సాధన లేనేలేదు! మనస్సు చంచలత్వంతో ఉన్న నేటి మానవుని స్థితికి నామస్మరణ సరైన తరుణోపాయం అనే చెప్పాలి. నామస్మరణ విశిష్టత, శక్తి అఖండమైనది. పిల్లి తన కోరలతో తన పిల్లలను పట్టుకున్నా ఏమి కాదు కానీ అవే కోరలతో ఎలుకను పట్టిందంటే చీల్చి వేయగలదు. అలాగే నామస్మరణ చేస్తూ ఉంటే ఎంతటి సమస్య అయినా వదలి పోవాల్సిందే! అయితే దీనికి తోడు విశ్వాసం పునాదిగా ఉండాలి. తనను నమ్మి, విడువక ,మరువక నిత్యము స్మరించేవారిని భగవంతుడు ఎన్నటికీ చెడనీయుడు. వారి జీవిత భారమంతా తానే చూసుకుంటాడు.
