అసలు పంచాంగం అంటే ఏమిటి?

తిథిర్వారంచ నక్షత్రం యోగః కరణమేవచ పంచాంగమ్ అన్నారు. పంచాంగంలో అయిదు ముఖ్యవిభాగాలు ఉంటాయి. అంటే తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణాలనే అయిదు అంగాల శుభాశుభ ఫలితాలను తెలియచేసేది అని అర్థం. వీటిలో –

1. తిథి – శ్రేయస్సును ఇస్తుంది.
2. వారం – ఆయుష్షు కలిగిస్తుంది.
3. నక్షత్రం – పాపాలను తొలగిస్తుంది.
4. యోగం – రోగాలను నివారిస్తుంది.
5. కరణం – కార్యాలను సిద్ధింపచేస్తుంది.

నిత్యపూజావిధిలో ఈ అయిదింటినీ స్మరించుకోవడమే సంకల్పం. వీటిని తెలుసుకునేందుకే పంచాంగం. తెలుగువారి పంచాంగాలు చాంద్రమానాన్ని ఆధారం చేసుకుని రూపొందిస్తారు. చాంద్రమానం అంటే చంద్రుడి గమనం అని అర్థం. భూమిచుట్టూ తిరిగే చంద్రునికి పదహారు కళలున్నాయి. అవే పాడ్యమి నుంచి పౌర్ణమి లేదా అమావాస్య వరకూ ఉన్న తిథులు. వీటిలో పాడ్యమి నుంచి పౌర్ణమి వరకూ శుక్లపక్షంలో చంద్ర కళలు వృద్ధి పొందుతాయి. తిరిగి పాడ్యమి నుంచి అమావాస్య వరకూ బహుళ లేదా కృష్ణపక్షంలో చంద్రకళలు క్షీణిస్తాయి. చంద్రకళల ఆధారంగా శుక్ల పాడ్యమి నుంచి అమావాస్యవరకూ మనకు ఒక మాసం అవుతుంది. చైత్రం నుంచి ఫాల్గుణం వరకూ ఉండే పన్నెండు మాసాలు ఇలా ఏర్పడినవే.

పంచాంగ విభాగాల వరుసలో వారానిది రెండోస్థానం. ఆది నుంచి శనివరకు వారాలు ఏడూ వరుసగా వస్తాయి. అశ్వని మొదలు రేవతి వరకూ 27 నక్షత్రాలు. ఆయా నక్షత్రాల్లో చంద్రసంచారాన్ని బట్టి విష్కంభం నుంచి వైధృతి వరకూ 27 యోగాలు ఏర్పడతాయి. తిథిలో సగం సమయంపాటు ఉండే కరణాలు బవ నుంచి కింస్తుఘ్నం వరకూ ఉన్నాయి. తిథుల్లో విదియ, తదియ, పంచమి, సప్తమి, దశమి, ఏకాదశి, త్రయోదశి, పౌర్ణమి తిథులను శుభతిథులుగా పరిగణిస్తారు. వారాలలో మంగళ, శుక్రవారాల పట్టింపు ఎక్కువమందికి ఉంటుంది. నక్షత్రాలలో శుభాశుభాలను తెలియచేయడానికి పంచాంగాలలో తారాబలం చూసుకునే విధానం ఉంటుంది. దీనికోసం అన్ని పంచాంగాలలో ఇటీవల ప్రత్యేక స్థలం కేటాయిస్తున్నారు. యోగం, కరణాలలో మంచిచెడులు అర్థం చేసుకునేందుకు, ఆచరించేందుకు కఠినం కావడంతో నేడు వాటిని చూసేవారి సంఖ్య తగ్గింది. వాటితో పోల్చితే పంచాంగాల్లో పేర్కొనే అమృతఘడియలు, ఆనందాది యోగాలు ఎక్కువ 62 ప్రయోజనకరమైనవి.

Share this post with your friends