భోళా శంకరుడు.. ఆయన్ను ప్రసన్నం చేసుకోవడం చాలా సులభమంటాయి పురాణాలు. ఒక్క అభిషేకంతో మురిసిపోతాడు. అలాంటి శంకరుడు శ్మశానాల్లో తిరుగుతూ.. చితాభస్మాన్ని ధరిస్తుంటాడు. ఇక కొన్ని సందర్భాల్లో అయితే పుర్రెలు, ఎముకలు ధరించి కనిపిస్తుంటాడు. అసలు భోళా శంకరుడు ఎందుకిలా కనిపిస్తుంటాడు. చాలా మందికి వచ్చే అనుమానం. ఇవన్నీ అశుచికి లక్షణాలు కదా.. ఇదే అనుమానం ఒకసారి పార్వతీదేవికి కూడా వచ్చి ఆయనను ప్రశ్నించిందట. అశుచికి లక్షణాలైన వాటిని ఎందుకు ధరిస్తున్నావని స్వామివారిని అమ్మవారు అడిగిందట.
దీనికి శివుడు ఓ కథను చెప్పాడట. అదేంటంటే.. పూర్వం దేవతలను రాక్షసులు నిత్యం వేధిస్తూనే ఉండటంతో యుద్ధం అనివార్యమవుతూ ఉండేదట. బ్రహ్మాది దేవతలను తమ తపస్సుతో మెప్పించి రాక్షసులు వరం పొంది ఉండటంతో దేవతలను బాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. దీంతో దేవతలంతా శ్రీ మహావిష్ణువును వేడుకున్నారట. అప్పుడు శివుడిని విష్ణుమూర్తి పిలిచి రాక్షసుల బారి నుంచి దేవతలకు విముక్తి కలిగించాలని సూచించాడట. అప్పుడు శివయ్య రాక్షసుడి మాదిరిగా పుర్రెలు, ఎముకలు ధరించి.. బూడిద రాసుకుని రాక్షసుల వద్దకు వెళ్లి వారిని ఆకర్షించి నాశనం చేశాడట. ఇది శివయ్య అశుచిగా ఉండటం వెనుక కారణం.