Why Lord Shiva called Mallikarjuna : శ్రీశైలంలో శివుడిని మల్లికార్జునుడని ఎందుకు పిలుస్తారంటే..

ద్వాదశ జ్యోతిర్లింగాలలో రెండవది శ్రీశైలమని చెప్పుకున్నాం కదా. భూలోక కైలాసంగా శ్రీశైలం ప్రఖ్యాతిగాంచింది. శ్రీశైలంలో పార్వతీదేవిని భ్రమరాంబిక అని ఎందుకు అంటారో తెలుసుకున్నాం కదా.. ఇప్పుడు శ్రీశైలంలో పరమేశ్వరుడిని మల్లికార్జునుడని ఎందుకు అంటారో తెలుసుకుందాం. శ్రీశైల క్షేత్రంలో శివుడిని మల్లికార్జునుడిని పూజించడం వెనుక కూడా ఓ కథ ఉంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. కృష్ణానది తీరంలో మల్లికాపురం ఉండేది. దానికి మహారాజుగా చంద్రకేతుడు ఉండేవాడు. అతనికి సంతాన భాగ్యం కోసం తపిస్తూ ఉండేవాడు. ఎంతో కాలానికి చంద్రకేతుడికి కూతురు జన్మించింది. ఆమెకు చంద్రమతి అని నామకరణం చేశారు.

Why Lord Shiva called Mallikarjuna
Why Lord Shiva called Mallikarjuna

చంద్రమతి జన్మించడంతో చంద్రకేతుడి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఆ తరువాత రాజ పురోహితులు చంద్రకేతుని జైత్రయాత్రకు ముహూర్తం పెట్టారు. అది మొదలు చంద్రకేతుడు రాజ్య విస్తరణ కాంక్షతో కొన్నేళ్లపాటు జైత్రయాత్రను కొనసాగిస్తూనే ఉన్నాడు. అలా కొన్నేళ్లు గడిచిన తర్వాత చంద్రకేతుడు తన జైత్రయాత్ర ముగించి, తిరిగి మల్లికాపురానికి చేరుకున్నాడు. అప్పటికే చంద్రకేతుడి కుమార్తె చాలా అందంగా తయారవడంతో ఆమెను చూసి మోహించి ఎలాగైనా దక్కించుకోవాలనుకున్నాడు. ఆమె మీ కూతురేనని చెప్పినా కూడా చంద్రకేతుడు పట్టించుకోలేదు. చంద్రమతి తనను వదిలిపెట్టమని.. తను మీ కూతురునని వేడుకున్నా వదిలిపెట్టలేదు.

కామవాంఛతో చంద్రమతిని లోబరుచుకునేందుకు యత్నించగా.. తండ్రి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో ఆమె బ్రహ్మగిరిని వదిలి కృష్ణా నది దాటి కొండల్లోకి పరుగు తీసింది. అక్కడ ఓ గుహలో తలదాచుకోగా.. చంద్రకేతుడు గుహ బయటే కాపలా కాశాడు. అప్పుడు చంద్రమతి వేరే దారి లేక తనను కాపాడాలంటూ శివుడిని మల్లెపూలతో పూజించింది. ఆమె మొర ఆలకించిన పరమేశ్వరుడు ఆమెను ఆకుపచ్చ శిలగా మార్చేశాడు. అప్పుడు ఆ శిల దొర్లకుంటూ వెళ్లి పాతాళగంగలో పడగా అక్కడి నీరంతా పచ్చగా మారిపోయిందట. అనంతరం శివుడు మల్లికాపురమును నిర్మూలించాడట. అప్పటి నుంచి శివుడిని మల్లికార్జునుడిగా పిలుస్తారని ఆలయ స్థల పురాణం చెబుతోంది.

Share this post with your friends