హిందువులు చేతులు, కాళ్లకు నల్లదారం కట్టడం కేవలం భక్తి చిహ్నం మాత్రమే కాదు, దీని వెనుక ఆధ్యాత్మిక, జ్యోతిష్య కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా నల్ల రంగు దిష్టి దోషాలను తొలగించడానికి, ప్రతికూల శక్తుల నుంచి రక్షణ కోసం ఉపయోగిస్తారు. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు వివిధ సందర్భాల్లో నల్లదారం ధరించడం సంప్రదాయం. ఆరోగ్య సమస్యలున్నప్పుడు, వ్రతాలు, ప్రత్యేక పూజల సమయంలో కూడా నల్లదారం ధరించటం వల్ల శక్తి సంతులనం, రోగనిరోధక శక్తి పెరుగుతుందని నమ్మకం ఉంది. పురుషులు కుడి చేతికి, మహిళలు ఎడమ చేతికి నల్లదారం కట్టుకోవాలి. శనివారం లేదా అమావాస్య రోజుల్లో ధరించడం ఉత్తమం. నల్లదారం కట్టుకునే ముందు స్నానం చేసి స్వామివారి ముందు దీపం వెలిగించాలి. ఓం నమః శివాయ అనే మంత్రోచ్ఛారణ లేదా ఇష్టదైవాన్ని తలచుకోవడం శ్రేయస్కరమని పండితులు సూచిస్తారు.

