
గాయత్రీ హృదయంలో అమ్మవారిని ‘విరాడ్రూపిణి’గా చెప్పడం జరిగింది. అంటే ఈ సృష్టిలోని ప్రతి అణువూ అమ్మవారి స్వరూపమేనని అర్థం. పసుపు భూమి నుంచే వస్తుంది కాబట్టి పృథ్వీ తత్త్వం ఉంటుంది. గాయత్రీ హృదయం ప్రకారం చూస్తే.. అమ్మవారి పాదాలు పృథ్వీ లోకానికి ప్రతీకలు. ఒకవేళ భూమి తనలోని సారాన్నంతటినీ ఒక కొమ్ము రూపంలో దాచి పెడితే అది పసుపు కొమ్ము అవుతుందని అంటారు. అమ్మవారికి పసుపు మాల వేయడమంటే.. భూమి సంపూర్ణ శక్తిని అమ్మవారికి మాలగా సమర్పిస్తారు. స్త్రీకి పసుపు అనేది సౌభాగ్యానికి చిహ్నం.
పార్వతీ దేవి సైతం నలుగు మిశ్రమం నుంచే వినాయకుడిని సృష్టించింది. పసుపులో అమ్మవారికి సొంతమైన సృజనాత్మక శక్తి ఉంది. అందుకే అమ్మవారికి పసుపు మాల ప్రీతిపాత్రం. అంతేకాదు.. లలితా సహస్రనామం ప్రకారం అమ్మవారిని ‘హరిద్రా కుంకుమ ప్రియ’ అని పిలుస్తారు. అంటే పసుపు, కుంకుమలంటే అమ్మవారికి అమితమైన ఇష్టం. మనలోని “అజ్ఞానాన్ని” వదిలించుకోవడమే పసుపు కొమ్ముల మాల వెనుక అంతరార్ధం. పసుపు కొమ్ములను దారంతో బంధించి అమ్మవారి పాదాల చెంత ఉంచడం వల్ల మన మనస్సు కూడా పసుపు లాగే పవిత్రంగా, మంగళకరంగా మారుతుందట.
భారతీయ సంప్రదాయాలలో స్త్రీ, పురుషులు ధరించే ప్రతి ఆభరణానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ముఖ్యంగా మహిళల అందాన్ని, ప్రత్యేకతను చాటే వెండి పట్టీలు ఒక ప్రత్యేక స్థానాన్ని ఆక్రమిస్తాయి. చిన్న పెద్ద తేడా లేకుండా మహిళలు పాదాలపై వెండి పట్టీలను ధరించడం తరచుగా కనిపిస్తుంది. భారతీయ సంప్రదాయంలో బంగారం లక్ష్మీదేవి రూపంగా భావించబడుతుంది. కాబట్టి పసిడితో అలంకరించిన పాదాల అలంకరణ సాధారణంగా ఉండదు. అయితే, వెండి పట్టీలు పాదాలకు ధరించడం గౌరవనీయమైన ఆచారం. ఇది కేవలం అలంకరణ మాత్రమే కాకుండా, మతపరమైన, జ్యోతిషశాస్త్ర, ఆయుర్వేద సంబంధిత కారణాలను కలిగి ఉంది.
