
శ్రీ మధ్వాచార్యుల వారు తన పన్నెండో ఏట అచ్యుతప్రజ్ఞ తీర్థుల గురుకృపతో సన్యాసం స్వీకరించారు. బాల్యంలో ఉండగానే వాసుదేవ ఆధ్యాత్మికత విషయాలవైపు ఆసక్తి చూపుతూ వాటిని ఆకళింపు చేసుకునేవారు. చిన్నవయసులోనే సకల శాస్తజ్ఞ్రానం సంపాదించుకున్నందువల్ల పూర్ణ ప్రజ్ఞుడన్న బిరుదు ప్రసాదించారు. ద్వైతమతాన్ని ప్రతిపాదించినందువల్ల ఆయన అనుసరించిన మధ్యేమార్గానికి చిహ్నంగా శ్రీమధ్వాచార్యులన్న నామధేయం కూడా వరించింది. గొప్ప కార్యసాధకుడు అనటానికి ఆయన చేపట్టిన విస్తృత సైద్ధాంతిక కార్యక్రమాలే ప్రబల నిదర్శనాలు.
రుక్మిణీ దేవి పూజించే బాలకృష్ణ విగ్రహం ఉడిపి క్షేత్రంలో ప్రతిష్ఠించింది మధ్యాచార్యులవారే. శ్రీమధ్వాచార్యులవారు సుదీర్ఘ జీవితకాలంలో మూడు పర్యాయాలు బదరీయాత్ర విజయవంతంగా నిర్వహించారు. వారి చివరియాత్ర 1317లో 79వ ఏట పరిపూర్ణమైంది. ఆ తిరిగిరాని పయనమే మధ్వానవమి వైశిష్ట్యానికి సంప్రదాయంగా మారింది. ఈ సందర్భంగా అన్ని మఠాల్లో దేశ వ్యాప్తంగా ఆరాధనా కార్యక్రమాలు నిర్వహిస్తారు. జీవుడు వేరు, బ్రహ్మము వేరు, జీవుడు మిథ్య కాదు. అలాగే జడ జగత్తు కూడా మిథ్యకాదు. ఈశ్వరుడు ఎంత సత్యమో జీవ జగత్తులు కూడా అంత సత్యం. భక్తి ఒక్కటే ముక్తిదాయకం. అది జ్ఞాన పురస్కృతమైన భక్తి అయి ఉండాలి.
