ఊర్థ్యలోకాలైన మహర్లోకం, జనలోకం, తపోలోకం, సత్యలోకంలో ఎవరుంటారు?

ఊర్థ్వ లోకంలోని తొలి మూడు లోకాల గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మిగిలిన నాలుగు లోకాల గురించి తెలుసుకుందాం.

మహర్లోకము: ఇది సువర్లోకము పైన ఉంటుంది. ఇక్కడ దేవతలు తపస్సు చేస్తుంటారని చెబుతారు. ఎలా స్వర్గలోకంలోని దేవతలు దివ్య సుఖాలను అనుభవిస్తున్నారో, అవన్నీ ఇక్కడ తపస్సు ద్వారా పరిపూర్ణంగా అనుభవిస్తుంటారు.

జనోలోకము: ఇది మహర్లోకము పైన ఉంటుంది. దీనిని కొందరు సత్యలోకం అని కూడా పిలుస్తారు. ఏ స్త్రీ, భర్త మరణానంతరం సహగమనం చేస్తారో, ఆమె పవిత్ర శీలప్రభావంతో, ఆమె పతికి అన్య జన్మ ఉన్నప్పటికినీ, జన్మరాహిత్యం కలిగి, సతిపతులిరువురూ, ఈ జనలోకంలో సుఖశాంతులతో వర్ధిల్లుతుంటారు. అలాగే ఇక్కడ అయోనిజ దేవతలు కూడా తపమాచరిస్తుంటారు.

తపోలోకము: జనోలోకము పైన ఉంటుంది. ఇక్కడ అయోనిజ దేవతలు నివసిస్తారు. పంచభూతాలు, పంచేంద్రియాలు వీరి ఆధీనంలో ఉంటాయి. కైలాసం, వైకుంఠం, మణిద్వీపం, స్కంధలోకం ఇక్కడే ఉంటాయి. ఈ లోకం సర్వదా సుగంధ ద్రవ్యాల సువాసనలతో, శాంతియుతంగా, సాంద్రానందంతో కూడి ఉంటుంది. భూలోకంలో ఎవరెవరు, ఏయే దేవతాముర్తులను ఉపాసిస్తారో, ఆయా మూర్తుల రూపాలతో ఇక్కడ తపం ఆచరిస్తారు. ఈ రీతిగా వారు కల్పాంత-కాలం అక్కడనే ఉండి, కర్మానుసారం భూలోకంలో తిరిగి జన్మించి, తిరిగి పవిత్ర తపాలు ఆచరించి, ఎప్పుడు మహాప్రళయంలో సర్వం లయమగునో, అప్పుడు వీరు కూడా జన్మరాహిత్యం పొందుతారు.

సత్యలోకం: తపోలోకము పైన ఉంటుంది. ఇక్కడ సృష్టికర్త అయిన హిరణ్యగర్భుడు, బ్రహ్మ అను ఒక అధికారిక పురుషుడు, ఆ పదవిని అనేకానేక కల్పానంతరం ఒక్కక్కరు పొంది, తమ ఆయువు తీరినంతనే బ్రహ్మంలో లయమవుతారు.

Share this post with your friends