
దైవం ఒక అనుభవం. ఇనుప ముక్కను బాగా కాలిస్తే అందులోకి ఉష్ణం వ్యాపిస్తుంది. ఆ ఉష్ణం ఇనుప ముక్క ఎంతవరకు విస్తరించి ఉందో అంతవరకు వ్యాపిస్తుంది. అందులో వేడి కనిపించకపోవచ్చు, కానీ ముట్టుకుంటే చుర్రుమనిపిస్తుంది. నామస్మరణతో మనసును పదేపదే భక్తిపూర్వకంగా సాధనలో ఉంచుతుంటే దేహమంతా ఆధ్యాత్మిక తరంగ ప్రవాహంగా మారిపోతుంది. నామస్మరణ చేయగా.. చేయగా వెదురు ముక్క లాంటి శరీరం వేణువవుతుంది. బృందావనంలో శ్రీకృష్ణుడు ఆలపించిన నాదమవుతుంది. ముల్లోకాలూ తిరిగి, ‘నారాయణా! నారాయణా!’ అని స్మరించే నారదుడి చేతిలో తంబుర అవుతుంది.
భక్తి-ప్రేమలను నింపి చేసే నామస్మరణకు మించిన యోగం లేదు. పూర్వజన్మ పుణ్యంవల్లనే ఆ భాగ్యం కలుగుతుంది. దాన్ని దక్కించుకున్నవారు తుకారాం, త్యాగయ్య, అన్నమయ్య, రామదాసు, ప్రహ్లాదుడు లాంటి భక్తులు. వారే సజీవ సాక్ష్యంగా కాలంలో నిలిచి నామ మాహాత్మ్యాన్ని విశ్వానికి వెల్లడించారు. పురాణాల్లో, శాస్త్రాల్లో చదివాం ఆ మహానుభావుల గురించి. మనం కూడా అనుభవంలోకి తెచ్చుకోవచ్చు. అందుక్కావల్సింది సాధనయే. పూజ కోసం సామగ్రి కొనాలి. ఎన్నోకొన్ని నియమాలు పాటించాలి. వ్రతాలకూ, నోములకూ ఐతే కఠోరమైన నియమాలుంటాయి. యజ్ఞాలకూ, క్రతువులకూ శక్తియుక్తులుండాలి. శాస్త్రం తెలిసి ఉండాలి. దోషరహితంగా చెయ్యాలి.
కలియుగంలో నామస్మరణను మించింది లేదని చెప్పారు. ఎక్కడ ఉన్నా ఏ పని చేస్తున్నా మనసును లగ్నం చేసి నామం స్మరించుకోవచ్చు. పనికి ముందూ, పనులు చేస్తూ నామస్మరణ, పని తరవాత మళ్ళీ నామస్మరణ చేస్తూ ఉంటే ఆ చేసే పని పవిత్రమవుతుంది. అందులోని దోషాలు హరించిపోతాయి. ఆ విధంగా చేసే కర్మ భగవదర్పణ కర్మ అవుతుందని భగవద్గీత చెబుతోంది. భయంలో, బాధలో, సుఖంలో, సంతోషంలో తేనెను పాలల్లో కలుపుకొన్నట్లు జీవితంలో నామాన్ని కలుపుకోవాలి. దైవం ఎప్పుడూ మనతో కలవడానికి త్వరపడుతూనే ఉంటాడు. నామస్మరణ ఈ రోజు మొదలుపెడితే ఇప్పుడే ఆయన మనకు చేరువవుతాడు. నిరంతర భగవన్నామ స్మరణమే ఆధ్యాత్మిక జీవితానికి బంగారుబాట. సర్వకాల సర్వావస్థల్లోనూ భగవన్నామ స్మరణ చేయవచ్చు.
