శివుని ఉగ్ర రూపమైన కాల భైరవుడి గురించి జన్మ వృత్తాంతం ఏంటో తెలుసుకున్నాం కదా. బ్రహ్మ, విష్ణువుల మధ్య వివాదం జరిగిన సమయంలో కాలభైరవుడు జన్మించాడని చెప్పుకున్నాం. అసలు ఏం వివాదం జరిగిందో తెలుసుకుందాం. బ్రహ్మ దేవుడు తన కంటే గొప్పవాడు లేడని.. తన నుంచే ప్రపంచం పుట్టిందని.. తన నుంచే అంతమవుతుందని గర్వంతో చెప్పడంతో విష్ణుమూర్తికి కోపం వచ్చింది. ఆ సమయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరుగుతోంది. అప్పుడు ఈ వాగ్వాదాన్ని చూసిన శివుడు ఆగ్రహంతో కాలభైరవుని అవతారమెత్తాడని తెలుసుకున్నాం. అసలు బ్రహ్మకు.. శ్రీమహావిష్ణువుకు మధ్య జరిగిన వాగ్వాదమేంటో తెలుసుకుందాం.
బ్రహ్మ తనతో ప్రపంచం మొదలు.. అంతమవుతుందని చెప్పిన మాటలు విని అక్కడ ఉన్న శ్రీ మహా విష్ణువు చాలా బాధపడ్డాడు. అప్పుడు విష్ణువు.. బ్రహ్మతో మాట్లాడుతూ నా ఆజ్ఞ ప్రకారం మీరు విశ్వ సృష్టికర్త కనుక మిమ్మల్ని మీరు పొగుడుకోవద్దని అన్నాడు. అప్పుడు ఇద్దరి మధ్య ‘నేను గొప్ప అంటే నేను గొప్ప’ అంటూ వాగ్వాదం మొదలు పెట్టారు. తామే గొప్పవారమని నిరూపించుకోవడానికి వేదాలు పఠించారు. క్రమక్రమంగా వాగ్వాదం పెరిగింది. ఆ తర్వాత నాలుగు వేదాలను బ్రహ్మ వాటి ఔన్నత్యాన్ని గురించి అడిగాయి. అప్పుడు ఋగ్వేదం శివుడిని స్మరిస్తూ.. భూమి అంతా ఎవరిలో నివసిస్తుందో అతడే శివుడని పేర్కొంది. అప్పుడు యజుర్వేదం శివుని అనుగ్రహం వల్లనే వేదాల ప్రామాణికత రుజువవుతుందని.. సామ వేదం.. సమస్త లోక ప్రజలను తప్పుదోవ పట్టించే వాడు.. అతని తేజస్సుతో ప్రపంచం మొత్తాన్ని వెలుగులోకి తెస్తుందని ఆయనే త్రయంబకుడైన శివుడని పేర్కొంది.
వేదాలు చెప్పినది విన్న తర్వాత బ్రహ్మకు కోపం వచ్చింది. “ఓ వేదల్లారా.. మీ మాటలు మీ అజ్ఞానానికి నిదర్శనం. శివుడు ఎప్పుడూ తన శరీరంపై భస్మంతో.. తలపై శిగ, మెడలో రుద్రాక్షలు, పాములను ధరిస్తాడు. అలాంటి శివుడిని అత్యున్నత మూలకం అని ఎలా పిలుస్తారు? ఆయనను పరమ బ్రహ్మగా ఎలా పరిగణిస్తారు?’’ అని ప్రశ్నించాడు. బ్రహ్మ చెప్పిన మాటలు విన్న శ్రీ హరి ‘‘సాకారమైన, నిరాకారమైన రూపంలో ప్రతిచోటా ఉన్న ఓంకార స్వరూపుడు.. శివుడు శక్తితో కూడినవాడు’’ అని చెప్పాడు. ఇలా బ్రహ్మ, విష్ణువుల మధ్య వాగ్వాదం జరిగింది. అది విన్న శివుడు ఉగ్రరూపుడై కాల భైరవుడిగా మారిపోయాడు.