మేకు అంటే ఏమిటి?

‘ఎక్కువతిన్న పొట్ట, ఏకులు పెట్టిన బుట్ట చిరగవు.’, ‘వెన్నకు పళ్ళు వచ్చి, ఏకులు కమికినప్పుడు గద!’ అనే రెండు జాతీయాలలో మొదటిది ఏకులు మెత్తగా ఉండడాన్ని సూచించగా, వాటి మెత్తదనం మరీ వెన్న యొక్క మెత్తదనంతో పోటీ పడగల మెత్తదనం కాదు అని సూచిస్తుంది. దూదితో ఏకుపుల్లకు ఏకులు చుట్టేటప్పుడు మరీ గట్టిగాను కాకుండా, మరీ సున్నితంగాను కాకుండా మధ్యస్తంగా చుట్టాలి. గట్టిగా బిగించి చుడితే, తకేలీతోనో, రాట్నంతోనో ఏకు నుంచి నూలు తయారు చేసే సందర్భంలో దూది పోగులు సక్రమంగా నూలుగా మారవు.

నూలు మొత్తం ఏక మందంగా తయారవ్వాలంటే ఉండవలసిన బిగింపు ఎక్కువైతే, నూలు మధ్యలో తెగిపోయే అవకాశం ఉంది. అలా గట్టిగా చుట్టబడిన ఏకులను మేకులతో పోల్చేవారు. ‘ఎండ కాసిననాడు ఏకులు వాడికి, వాన కురిసిననాడు పత్తిలో గింజలు తీసినట్లు’ అని ఒక జాతీయం ఉంది. దీని అర్థం, ఏకాలంలో చెయ్యవలసిన పని ఆ కాలంలో చెయ్యాలి అని! బాగా ఎండబెట్టిన దూదిలో నుండి గింజలు తీసు ఏకులు చుట్టడం అనేది వాతావరణం పొడిగా వుండే సమయంలో (వేసవిలో) చేసుకొనే పని. ఎండలు ఉన్నతకాలం తయారు చేసుకొన్న ఏకులను దాచిపెట్టుకొని, వాటిని ఆ తర్వాత వడకడానికి వాడేవారు.

పైవిధంగా తయారుచేసుకొన్న మెత్తటి ఏకులను దాచుకొని తగిన సమయంలో వాడుకోకపోవడాన్ని సూచించాడానికి ‘ఏకులు వడికినట్టూ కాదు, మగడి దగ్గర తొంగున్నట్లు కాదు.’ అనే మరో జాతీయం ఉంది. ఇలా తయారుచేసిన ఏకులను తగిన సమయంలో వాడకుండా ఎక్కువకాలం దాచడంలో లోపం జరిగితే వాటికి తేమ తగిలితే, అవి కూడ గట్టిగా మారిపోయి దారం తీయడానికి పనికిరావు. వాటిని కూడ ‘ఏకు మేకు అవ్వడం’ అనేదానికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఒకప్పుడు మెత్తని స్వభావం కలిగి వుండి తరువాత కాలంలో కఠిన స్వభావాన్ని పొంది ఎదిరించేవారిని గురించి చెప్పే సందర్భంలో ఈ జాతీయాన్ని సంఘంలో వాడుతుంటారు.

Share this post with your friends