ఏకు మేకు అవడం అంటారు కదా.. అసలు ఏకు అంటే ఏమిటి?

ఏకు మేకు అవడం అనడాన్ని మనం సాధారణంగా వింటూనే ఉంటాం. కొన్ని సందర్భాలకు దీన్ని అన్వయించి వాడుతూ ఉంటాం. దీనికంటే ముందుగా ఏకు అంటే ఏమిటో తెలుసుకుందాం. బట్టను తయారు చేయడానికి నూలు (దారం) అవసరం. ఆ నూలు ప్రత్తిని శుభ్రపరచి, ఏకులుగా తయారుచేసి, వాటిని రాట్నంపై వడుకుటం (పురిపెట్టి దారంలా తయారు చేయడం) ద్వారా తయారువుతుంది. మొదటి బొమ్మలో శుభ్రపరచిన దూదిని ఏకు పుల్లకు చుడుతున్నారు. రెండవ బొమ్మలో చుట్టబడిన ఏకును పుల్లనుండి వేరుచేస్తున్నారు.

ఆవిధంగా దూదిని చుట్టడం ద్వారా వచ్చినదే ఏకు. దూదితో తయారు చేసిన పొడవాటి మెత్తటి ఆకారమే ఏకు అంటే! దానిని ఒక చేతితో పట్టుకొని దాని నుంచి లాగిన కొన్ని పోగులను ‘తకిలీ’ అనే చిన్న పరికరానికి (బొంగరంలా ఉండి, మధ్యలో పొడవాటి ఊచ వుండి, దాని చివరన కొక్కెం లాంటిది ఉంటుంది) చుట్టి, తకిలీని తిప్పుతూ ఉంటే, ఏకు నుంచి, దూది పోగులు పురిపెట్టబడి నూలు తయారవుతూ ఉంటుంది. అలా తయారయిన దారాన్ని తకిలీకు చుడుతూ వుంటారు. ఇలా తయారు చేసిన దారాన్ని యజ్ఞోపవీతం తయారు చేయడానికి వాడేవారు. వస్త్రాలకైతే, రాట్నంపై నూలును వడికేవారు. ఇప్పుడన్నీ విద్యుత్తుతో నడిచే యంత్రాలే చేస్తున్నాయి.

Share this post with your friends